Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
నిష్పక్షపాతంగా పోడు పట్టాల ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ రెవెన్యూ పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. పోడు పట్టాల పంపిణీ ప్రక్రియలో పాలిగన్ మ్యాపులు తప్పులు లేకుండా కరెక్ట్ గా అప్లోడ్ చేయాలని బుధవారం ఐడిఓసి సమావేశపు హాలులో పోడు లబ్ధిదారుల ఫోటోలు కరెక్షన్, పాలిగన్ మ్యాపులు అప్లోడ్ చేయు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోడు ప్రక్రియ చివరిదశకు వచ్చామని, ఎలాంటి తప్పులకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ఎంతో పకడ్బందీగా పోర్టల్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. వ్యత్యాసాలను సరిచేయు అంశంపై తహసీల్దార్లు, ఎంపిడిఓల కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తయారు చేయబడిన జాబితాను తహసీల్దార్, ఎంపీడీఓ సంయుక్త ధ్రువీకరణ చేయాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డిఓలు స్వర్ణలత, రత్న కల్యాణి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
సోషల్ ఆడిట్ పెండింగ్ పేరాలపై చర్యలు
సోషల్ ఆడిట్ పెండింగ్ పేరాలను వెంటనే పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బుధవారం హైదరాబాదు నుండి గ్రామీణ అభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావు సోషల్ ఆడిట్ పేరాలు, ఉపాధి పథకం పనులకు లేబర్ మొబైలేసషన్ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో సోషల్ ఆడిట్ పేరాలపై పారదర్శక విచారణ నిర్వహించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పారు. పరిష్కరించబడిన అంశాలపై సమగ్ర నివేదికలు అందచేయాలని డిఆర్డీఓ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎపిడి సుబ్రహ్మణ్యం, రమణ తదితరులు పాల్గొన్నారు.