Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
ప్రభుత్వం చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం పంపింగ్ వెల్ రోడ్, కాళోజీ నారాయణ రావు పార్కులోని బస్తీ దవాఖానలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్, నగర మేయర్ పునుకోల్లు నీరజ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని 55 బందాలతో చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంగళవారం నాటికి 1,74,631 మందికి కంటి పరీక్షలు చేసినట్లు ఆయన అన్నారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి 42,428 మందికి రీడింగ్ కళ్ళద్దాలు ఆందజేసినట్లు, ఇప్పటివరకు 1,806 ప్రిస్కిప్షన్ కళ్ళద్దాలు వారి వారి ఇండ్ల వద్ద ఆందజేసినట్లు, ఇంకనూ 23, 797 మందికి ప్రిస్కిప్షన్ కళ్ళద్దాలు పంపిణీ చేయాల్సివున్నదని ఆయన తెలిపారు. జిల్లాలో 109 గ్రామ పంచాయతీలు, 28 వార్డుల్లో కార్యక్రమం పూర్తి చేసినట్లు, 43 గ్రామ పంచాయతీల్లో, 13 వార్డుల్లో కార్యక్రమం కొనసాగుతున్నట్లు ఆయన అన్నారు. కంటి పరీక్షలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికలు పంపిణీ చేసినట్లు, పారిశుద్ధ్య ఆటోలు, వాహనాల ద్వారా విస్తత ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ పరీక్షలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, ఖమ్మం మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జిల్లా వైద్యాధికారి డా. బి. మాలతి, స్థానిక కార్పొరేటర్ రుద్రగాని శ్రీదేవి, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.