Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బకాయి వేతనాలు చెల్లించే వరకు సమ్మె
- సీఐటియు రాష్ట్ర కార్యదర్శి బి. మధు
నవతెలంగాణ- భద్రాచలం
గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు గిరిజన ఎమ్మెల్యేలకు పట్టవా అని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి.మధు ప్రశ్నించారు. గిరిజన కార్మికులు 39 నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి ఇబ్బందులను ప్రభుత్వం గిరిజన ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. హాస్టల్ వర్కర్లు ఐటీడీఏ ముందు నిర్వహించిన ధర్నాలో మధు పాల్గొని మాట్లాడారు. 39 నెలలుగా వేతనాలు లేకుండా కార్మికులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. బకాయి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా దున్నపోతు మీద వాన పడిన చందంగానే వ్యవహరిస్తుందని విమర్శించారు. డైలీ వైస్ వర్కర్లకు 10 నెలలు వేతనాలు రావాలని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాల చెల్లింపు పై ఈ కుబేర్ లో పెట్టిన ఫ్రీజింగ్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికులకు రావలసిన వేతనాలకు సంబంధించిన చెక్కును ఆర్థిక శాఖ వెంటనే పాస్ చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు ఇవ్వాలని కోరారు. ఐదు సంవత్సరాల సర్వీస్ గలిగిన కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. బకాయి వేతనాలు చెల్లించే వరకు ఔట్సోర్సింగ్ కార్మికుల నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలిపారు. పాల్వంచ ఏటిడబ్ల్యూ పరిధిలోని కొందరు వార్డెన్లు సమ్మెను విచ్చిన్నం చేయటానికి కుట్రలు చేస్తున్నారని వారి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. వేతనాలు లేకుండా కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటారని వార్డులను ప్రశ్నించారు. మీకు జీతాలు రాకపోతే మీరు ఉద్యోగం చేస్తారా అని నిలదీశారు. ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని ఆర్థిక మంత్రి మీద ఒత్తిడి తెచ్చి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు ముందు సిఐటియు కార్యాలయంలో సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి, హాస్టల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, జిల్లా నాయకులు జలంధర్, ముత్తయ్య, లక్ష్మణ్, నాయక్, రామ, జయమ్మ, మంగమ్మ, యశోద బాలరాజు జోడి లక్ష్మి, నాగమణి, రాములు, స్వరూప, భద్రమ్మ, అజిత, తదితరులు పాల్గొన్నారు.