Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనులు పూర్తి చేసుకోని పైలట్ బడులు
- ప్రారంభానికి సిద్ధమైన మోడల్ స్కూల్స్
నవతెలంగాణ - అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కార్యాల్లో మన ఊరు - మన బడి పేరుతో పల్లె పాఠశాలల పునరుద్దరణ ఒకటి. ఈ పాఠశాలలు ఆయా జిల్లాల కలెక్టర్ స్వీయ పరిశీలనలో ఐ.బి ఇంజనీరింగ్ విభాగం అధికారులు పర్యవేక్షణలో నిర్మిస్తున్నారు. అయితే వీటి నిర్మాణం పనులు నత్తనడకను మరిపించేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. పనులు ప్రారంభించి సంవత్సరం కావస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ప్రారంభంలో ప్రతీ మండలం లోనూ ఓ రెండు పాఠశాలలను పైలెట్ ప్రాజెక్ట్ విభాగంలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం ప్రతీ మండలంలోను ఈ పాఠశాల పనులను ఆయా నియోజక వర్గాలు ఎమ్మెల్యేలు లాంచనంగా ప్రారంభించారు. ఇందులోనే అనంతరం మరో రెండేసి పాఠశాలలను మోడల్ స్కూల్స్ రూపొందించాలని ప్రతిపాదించారు. అశ్వారావుపేట మండలంలో మొత్తం 23 పాఠశాలలను ఈ పథకం కింద పునరుద్దరణ చేస్తున్నారు. ఇందులో గుమ్మడవల్లి, ఆసుపాక కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను పైలెట్ ప్రాజెక్ట్ విభాగంలో ఎంపిక చేసి గతేడాది ఏప్రిల్ 20న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పనులకు శంకుస్థాపన చేసారు. ఈ రెండు పాఠశాలలు పనులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇకపోతే ఈ 23 పాఠశాలలో అచ్యుతాపురం, ఊట్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు మోడల్ స్కూల్స్ ఎంపిక చేసి ఈ రెంటిని మిగతా పాఠశాలలకు ఆదర్శంగా ఉండేలా నిర్మించాలని తలపెట్టారు. అయితే ఎప్పుడో వెనకాల ప్రారంభించిన ఈ మోడల్ స్కూల్స్ పనులు పూర్తి చేసుకుని అందంగా ముస్తాబు అయి ప్రారంభానికి సిద్ధంగా ఉండగా లాంఛనంగా ఎమ్మెల్యే చేతులు మీదుగా పనులు ప్రారంభించిన పాఠశాలల్లో మాత్రం నేటికీ పనులు పూర్తి కాకపోవడం విచారం.
ఈ విషయమై ఐబి ఏ.ఈ కేఎన్బి క్రిష్ణను వివరణ కోరగా మొత్తం 23 పాఠశాలల్లో 8 పాఠశాలలు పనులు పూర్తి అయ్యాయని, 5 పాఠశాలలు వినియోగంలోకి వచ్చాయని, మోడల్ స్కూల్లుగా ఎంపికయిన 2 పాఠశాలలు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని తెలిపారు. మిగత పాఠశాల లో వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు.