Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
అంగన్వాడీ టీచర్స్అండ్హెల్పర్స్, మినీ అంగన్వాడీ టీచర్లకు గ్రాడ్యుటీ చట్టం అమలు కోసం మార్చి 1, 2, 3 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు సమ్మెకు దిగుతున్నట్లు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి.పద్మ తెలిపారు. గురువారం ములకపాడు యలమంచి సీతారామయ్య భవన్లో చర్ల, దుమ్ముగూడెం మండలాల సంయుక్త ప్రాజెక్టు సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఐసిడిఎస్ నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందన్నారు. బడ్జెట్లో నిధులు కోత పెట్టి పేద పిల్లలకు పౌష్టికాహారాన్ని దూరం చేస్తుందని విమర్శించారు. కేంద్రం పెంచిన గ్యాస్ బండ భారం అంగన్వాడీలకు గుది బండలా తయారైందన్నారు. ఆకాశాన్ని అంటే నిత్యవసర ధరలు భారంగా మారాయన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆరోగ్య లక్ష్మీ పధకం మెనూ చార్జీలు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలన్నారు. పెండింగ్లో ఉన్న టీఏ, డీఏలు, ఇంటి అద్దెలు చెల్లించాలని, అంగన్వాడీలకు కళ్యాణలకీë, షాదీముబారక్ పధకాలు వర్తింపజేయాలన్నారు. మార్చి 1వ తేదీన ప్రాజెక్టు కార్యాలయాల వద్ద, 2,3 తేదీలలో కలెక్టరేట్ల ముందు వంటావార్పు దీక్షలు, ధర్నాలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. అంగన్వాడీ టీచర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. పాయం రాధాకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు యం.విజయశీల, కమలాదేవి, కృష్ణవేణి, స్వరూప, కమలామనోహరి, రమణ, లలిత, సుశీల, వెంకటరమణ, కాంచనమాల, సమ్మక్క, పుష్ప, నాగమణి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.