Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏకైక జనరల్ సీట్ పై పార్టీల కన్ను
- సందిగ్ధంలో బీఆర్ఎస్ వర్గపోరుతో కాంగ్రెస్
- బీఎస్పీ సైతం పోటీకి సై
నవతెలంగాణ-పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏకైక జనరల్ నియోజకవర్గం కొత్తగూడెం. దీనిపై అన్ని రాజకీయ పక్షాలు దృష్టి సారించాయి. ఎన్నికలకు మరో ఆరు నెలలు కాల వ్యవధి ఉన్నప్పటికీ ఎవరికి వారు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న కొత్తగూడెం నియోజకవర్గం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టనుందో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన వనమా వెంకటేశ్వరరావు అభివృద్ధి లక్ష్యంగా కారు ఎక్కారు. అప్పటివరకు నియోజకవర్గంలో నామమాత్రంగా ఉన్న కారు జోరు పెరిగింది. అదే క్రమంలో ఆ పార్టీలో వర్గ పోరు తారేస్థాయికి చేరింది. నియోజవర్గంలో నాలుగు స్తంభాల ఆటగా టీఆర్ఎస్ పార్టీ కుమ్ములాడుకుంటుంది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి వీరే కాకుండా మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు వర్గం నియోజకవర్గంలో నాలుగు దిక్కులుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఆశీస్సులు తనకు ఉన్నాయంటూ ఆరోగ్యశాఖ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు నియోజకవర్గంలో చాప కింద నీరుల కార్యక్రమాలను చేపట్టాడు. ఇదంతా అధికార పార్టీకి గుడిబండగా మారుతుందని చెప్పవచ్చు. అధికార అడ్డదండలతో పార్టీ మనుగడ సాగుతోంది.
నియోజకవర్గంలో పార్టీపై ప్రజల సానుభూతి సన్నగిల్లుతోంది. అందుకు ప్రధాన కారణం ఎమ్మెల్యే తనయుడు అరాచకాలు అని చెప్పవచ్చు. అంతేకాకుండా వయోభారంతో ఈసారి వనమాకు సీటు ప్రశ్నార్థకమేనని ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అధికార పార్టీ నుంచి పలువురు ఆశావాహులు తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. అధికార పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సీటును ఆశిస్తున్నారు. అంతేకాకుండా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం దృష్టి సారించినట్లు సమాచారం. అధిష్టానం మాత్రం ఈ నియోజకవర్గంలో వామపక్షాలతో పొత్తు కుదుర్చుకుంటే సిపిఐ నుంచి సాంబశివరావుకు మద్దతు ప్రకటించే అవకాశాలు మెండు గా ఉన్నాయి. ఓ మాజీ ఎంపీ తన అభ్యర్థినిని సైతం నిలబెడతానని ప్రచారం ఉంది. బిజెపి నుంచి కోనేరు సత్యనారాయణ (చిన్ని) సీటును ఆశిస్తున్నారు. వామ పక్షాలు ప్రాబల్యం అధికంగా ఉన్న కొత్తగూడెం నియోజ కవర్గంలో బిజెపికి చెప్పుకోదగ్గ బలం లేదని చెప్పవచ్చు.
2009 ఎన్నికల్లో టిడిపితో పొత్తు కుదుర్చుకొని సిపిఐ సాంబశివరావు గెలుపొందాడు. ఆ తర్వాత 2014లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావు చేతిలో ఓటమిపాలయ్యాడు. అప్పటినుంచి నియోజక వర్గంలో సిపిఐ ఓట్ బ్యాంక్ సన్నగిల్లుతూ వస్తుంది. ఈ క్రమంలో మునుగోడు ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ సిపిఐ, సిపిఎంతో పొత్తు ఏర్పరచుకొని మునుగోడులో గెలుపొందడం ఈ పొత్తు ఎన్నికలకే పరిమితం కాదని రాబోయే సాధారణ ఎన్నికల్లోను కొనసాగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ వామపక్షాలతో పొత్తు ఉంటుందని భావించవచ్చు. అదే నిజమైతే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి అధికార పార్టీ అండతో సిపిఐ బరిలోకి నిలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటైన కొత్తగూడెం నియోజకవర్గం లో నాయ కత్వలేమి వర్గ పోరు కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీగా కొనసాగుతున్న ఎడవల్లి కృష్ణ, మాజీ ఎంపీ రేణుక చౌదరి ఆశీస్సులతో టిక్కెట్‌ను ఆశిస్తున్నాడు. అదే పార్టీ నుంచి శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు తనకి సీటు వస్తుందంటూ నియోజకవర్గంలో కార్యక్రమాలను చేస్తున్నాడు. ఇటు రేణుక చౌదరి అటు బట్టి విక్రమార్క ల మధ్య వర్గ పోరుతో కాంగ్రెస్ అయోమయంలో పడుతోంది. వీరే కాకుండా బీఎస్పీ నుంచి అభ్యర్థిని బరిలో దింపాలని ఆ పార్టీ అధిష్టా నం యోచిస్తోంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని నియోజక వర్గాలకు భిన్నంగా రాబోయే ఎన్నికల్లో కొత్తగూడెం నియో జకవర్గం నిలవనుంది ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిన అవసరం ఉంది.