Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులను, సిబ్బందిని అభినందించిన ఎస్పీ
నవతెలంగాణ-కొత్తగూడెం
పోక్సో కేసులో నిందితునికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడే విధంగా కృషి చేసిన అధికారులను, సిబ్బందిని గురువారం కొత్తగూడెం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డా.వినీత్.జి అభినందించారు. దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తూరుబాక గ్రామంలో 2018వ సంవత్సరంలో 16 నెలల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు అజ్మీరా సాయి కిరణ్కు 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానాను విధిస్తూ కొత్తగూడెం ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి ఎం.శ్యామ్శ్రీ తీర్పును వెలువరించారు. దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో పొక్సో యాక్ట్ 2012 ప్రకారం అప్పటి స్టేషన్ హౌస్ అధికారి బాలకృష్ణ కేసు నమోదు చేశారు. కేసునకు విచారణాధికారిగా అప్పటి భద్రాచలం ఏఎస్పీగా ఉన్న సంగ్రామ్ సింగ్ పాటిల్ సమగ్ర దర్యాప్తును చేపట్టి కోర్టు వారికి పూర్తి సాక్ష్యాధారాలను సమర్పించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా కృషి చేసిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పివిడి లక్ష్మీ, దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్, కోర్టు డ్యూటీ అధికారులు హెడ్ కానిస్టేబుల్ హరిగోపాల్, కానిస్టేబుల్ సీహెచ్.హనుమంతరావులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.