Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెక్టార్‌కు రూ.6,500 నుంచి రూ.15 వేల వరకు రాయితీ
- సీడీబీ ఎఫ్ఓ ఎం.కిరణ్ కుమార్
నవతెలంగాణ-అశ్వారావుపేట
రాష్ట్రంలో కొబ్బరి సాగు విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ఉద్యాన శాఖతో కలిసి కొబ్బరి అభివృద్ధి మండలి కార్యాచరణ సిద్ధం చేసిందని కొబ్బరి అభివృద్ధి మండలి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేంద్రం క్షేత్ర అధికారి ఎం.కిరణ్ కుమార్ తెలిపారు. ఆయన అశ్వారావుపేట గురువారం వచ్చిన సందర్భంగా స్థానిక కొబ్బరి విత్తనోత్పత్తి కేంద్రంలో నవతెలంగాణ తో మాట్లాడారు. ఆంధ్రాలో అత్యధికంగా ఉమ్మడి ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో 94,896 హెక్టార్లలో కొబ్బరి విస్తీర్ణం ఉంది అని అన్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజక వర్గం అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో 700 మంది రైతులు 2500 ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తున్నారని అన్నారు. గడచిన రెండేళ్లలో రూ.1,42 కోట్ల ఆర్థిక చేయూత నివ్వగా.. ఈ ఏడాది రూ.1.01 కోట్లు ఖర్చుతో యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు. కొత్త ప్రాంతంలో కొబ్బరి మొక్కలు నాటేందుకు ప్రాంతాలను బట్టి హెక్టార్‌కు రూ.6,500 నుంచి రూ.15 వేల వరకు ఆర్థిక సాయం అందించనున్నామన్నారు. పొడుగు రకం కొబ్బరి మొక్కల సాగు కోసం సాధారణ ప్రాంతాల్లో హెక్టార్‌కు రూ.6500, కొండ, గిరిజన ప్రాంతాల్లో రూ.13,750 చొప్పున ఇస్తామన్నారు. పొట్టి రకం మొక్కల సాగు కోసం సాధారణ ప్రాంతాల్లో హెక్టారుకు రూ.8,750, కొండ, గిరిజన ప్రాంతాల్లో రూ.13,750 చొప్పున, హైబ్రీడ్ రకం మొక్కల సాగు కోసం హెక్టారుకు సాధారణ ప్రాంతాల్లో రూ.7,500, కొండ, గిరిజన ప్రాంతాల్లో రూ.15 వేల చొప్పున రెండు వాయిదాల్లో ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. కనీసం 25 సెంట్ల నుంచి గరిష్టంగా 10 ఎకరాల వరకు కలిగిన రైతులు మాత్రమే ఈ పథకం కింద సబ్సిడీ పొందేందుకు అర్హులు, అర్హత గల రైతులు తమ సమీప వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారి ధ్రువీకరణతో దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తులను స్థానిక ఉద్యాన శాఖ కార్యాలయం లేదా విజయవాడ రామవరప్పాడులోని కొబ్బరి బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో గానీ నేరుగా అందజేయాలని అన్నారు.
సద్వినియోగం చేసుకోండి : కొబ్బరి అభివృద్ధి మండలి ఎఫ్ఓ ఎం.కిరణ్ కుమార్
కొబ్బరి అభివృద్ధి మండలి ద్వారా రాష్ట్రంలో ఈ ఏడాది కొత్త ప్రాంతాల్లో కొబ్బరి తోటల్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం అవసరం అయిన నిధులు కేటాయించాం. ఆసక్తి, ఔత్సాహిక రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వివరాల కోసం 0866 2972723 నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించండి.