Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటబడి కరుస్తున్న గ్రామ సింహాలు
- ఏడాది వ్యవధిలో 325 మందికి కుక్క కాటు
నవతెలంగాణ-బోనకల్/కొణిజర్ల
మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ప్రతిరోజు వీధి కుక్కలు వీరవిహారం చేస్తున్నాయి. మొరిగే కుక్క కరవదు అంటారు. కానీ మొరగని కుక్కలే కాదు మొరగేవి సైతం కూడా పిక్కల పట్టుకొని పీకుతున్నాయి. రాత్రి, పగలు అని తేడా లేకుండా వెంటపడి మరీ కరుస్తున్నాయి. పాదచారులనే కాదు ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని సైతం వదలటం లేదు. శునకాల దెబ్బకు ఇంటి నుండి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి అనేక గ్రామాలలో నెలకొని ఉంది. కుక్కల బెడద రోజు రోజుకి పెరిగిపోతుంది.
మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లెక్కల ప్రకారం మండల వ్యాప్తంగా గత ఏడాది జనవరి నుంచి నేటి వరకు మొత్తం 325 మందిని కుక్కలు కరిచాయి. రోజూ ఏదోఒక చోట కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా మండల కేంద్రంలో స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్, బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయం, దుర్గా పిక్చర్ ప్యాలెస్ వద్ద, ప్రధాన రహదారుల వెంట ప్రతిరోజు కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. గ్రామాలలో ప్రధాన రహదారుల సెంటర్లలో కుక్కలు పాదచారుల వెంట పడి మరీ కరుస్తున్నాయి. మండల కేంద్రం అయితే శునకాల గుంపుతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రధాన కూడలలో రోడ్ల వెంట కుక్కలు పడుకొని ఉంటున్నాయనే ఉద్దేశంతో పాదచారులు వెళుతుండగా ఒక్కసారిగా వారి వెంటపడి మరీ కరుస్తున్నాయి. కొన్ని గ్రామాలలో బయటకు రావాలంటేనే కుక్కల గుంపులను చూసి గడగడలాడిపోతున్నారు. ఒకప్పుడు కుక్క కాటుకి మానవుని బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో కుక్కకాటు బాధితులు కొంత గాలి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం కుక్క కాటుకి నాలుగైదు ఇంజక్షన్లు వేస్తే సరిపోతుంది. శునకాలు ఘర్షణ పడుతూ ఒక్కొక్కసారి పాదచారులపై కూడా పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ద్విచక్ర వాహనాలు దారులపై కూడా మరీ వెంటపడి కరుస్తున్నాయి. జంతు పరిరక్షణ చట్టం వల్ల వీధి కుక్కల సంఖ్య పెరిగి వాటి వీర విహారం కూడా పెరిగిపోయింది. గతంలో గ్రామపంచాయతీలు కుక్కల నియంత్రణకు ఏదో ఒక నియంత్రణ చర్యలు చేపట్టేవారు. కానీ ప్రస్తుతం ఏ గ్రామపంచాయతీ కూడా నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు. బోనకల్ గ్రామపంచాయతీలో కుక్కల బెడదన నివారించాలని సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో పలుమార్లు ఎంపీఓ వ్యాకరణం వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రికి లిఖితపూర్వక ఫిర్యాదు కూడా చేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో కుక్కల తప్పడం లేదు. కుక్కల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూ వాటి బాధితుల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామాలలో వీధి కుక్కల నియంతరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
రెచ్చిపోతున్న గ్రామసింహలు...
కొణిజర్ల : గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ అంబర్ పేటలో నాలుగు సంవత్సరాల బాబుపై వీధి కుక్కలు ఓళ్లు గగుర్పాటు గురైయ్యే విధంగా దాడి చేసి చంపిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారి రెండు తెలుగు రాష్ట్రాల ను భయందోళనకు గురైయ్యే లా చేసిన సంఘటన మరవకముందే కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామంలో బుధవారం సాయంత్రం 16 నెలల బాబు ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్క కరిచి గాయపరిచింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మండల వ్యాప్తంగా కుక్కలు స్వైర విహారంతో ప్రజలను హడలెత్తిస్తున్నాయి. రోడ్డుపైన కనిపించే వారిపై దాడి చేస్తూ గాయపరుస్తు న్నాయి. మండలంలోని ప్రతి గ్రామంలో ఏదో ఒకచోట ప్రతిరోజూ కుక్కల కాటుకి గురై దాడిలో గాయపడుతున్న సంఘటనలు తరచూ చోటుచేసుకుంటేనే ఉన్నాయి. దీంతో గ్రామాల్లో కుక్కల సంఖ్య పెరగడం తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొత్త వ్యక్తులు గ్రామాల్లో కనిపిస్తే పరుగెత్తించి కరవడమేకాక పొలాలకు వెళ్లే రైతులు వ్యవసాయ కూలీలపై,ఆడుకునే పిల్లలు పై మీదపడి గాయపరుస్తున్నాయి. అదేవిధంగా సాధుజం తువులనై కోళ్లు ఆవుదూడలను గాయపరుస్తున్నాయి. ఈ కుక్కల సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నియంత్రణ చర్యలు చేపట్టడంలో అలసత్వం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.