Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు
నవతెలంగాణ-కొణిజర్ల
వరకట్నం ఇవ్వడం... తీసుకోవడం చట్ట రీత్యా పెద్ద నేరమని, కుటుంబాలు, భార్యా భర్తల మధ్య గొడవలకు కారణమైన ఈ వరకట్న భూతాన్ని పారదోలడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ బూనాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. కొణిజర్ల పంచాయతీ కార్యాలయంలో గురువారం సాయంత్రం న్యాయ సేవాధికార సంస్థ ఖమ్మం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరకట్నం వల్ల గంటకో మహిళ మృతి చెందుతుందన్నారు. భారత దేశం మినహా వేరే ఏ దేశంలో కట్నం తీసుకునే దురాచారం లేదన్నారు. వరకట్నాన్ని రూపుమాపడానికి యువత నడుం బిగించాలన్నారు. బ్రూణ హత్యల ( అబార్షన్స్)లో తెలంగాణలోనే ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే చిన్నారిని చంపి వేస్తున్నారన్నారు. అబార్షన్ కూడా హత్యతో సమానమే అన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావేద్ పాషా, తహసీల్దార్ దొడ్డారపు సైదులు, కొణిజర్ల సర్పంచ్ సూరంపల్లి రామారావు, న్యాయ సహాయ న్యాయవాది ఇమ్మడి లక్ష్మీనారాయణ, రాజబోయిన శ్రీనివాసరావు, ఎస్ఐ శంకరరావు పాల్గొన్నారు.