Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'' సాగు నీటి కోసం ఖమ్మం జిల్లాలోని నాగార్జున సాగర్ ఆయకట్టుదారులు గోస పడుతున్నారు. కాల్వల నిర్వహణలో లోపాల కారణంగా రెండున్నర లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతినే ప్రమాదం పొంచివుంది. ఇప్పటికే బోనకల్ బ్రాంచ్ కెనాల్ (బీబీసీ) పరిధిలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని క్రమబద్ధీకరించే రెగ్యులేటర్‌ను నిర్మించకపోవడంతో ఆంధ్రాప్రాంతానికి నీరు తరలుతోంది.''
- రెండున్నర లక్షల ఎకరాలకు పైగా పంటలకు నీటి కటకట
- లష్కర్ల కొరత...నిర్వహణ పరమైన లోపాలే కారణం..!
- నల్లగొండలో దెబ్బతిన్న కాల్వ... 'పాలేరు'లో తగ్గిన నీటి నిల్వ
- బీబీసీ రెగ్యులేటర్ లేక ఆంధ్రాకు తరలుతున్న నీరు
- నిర్వహణ కట్టుదిట్టం చేస్తేనే చేతికి మక్క, వరి, ఇతర పంటలు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టు సమస్యల్లో చిక్కుకుంది. సాగు నీరు కోసం రైతాంగం తంటాలు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా బోనకల్ బ్రాంచ్ కెనాల్ (బీబీసీ) పరిధిలో నీటి సరఫరా మరింతగా క్షీణించింది. మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని మండలాలు వానకాలంలోనే నీటి కోసం అల్లాడాయి. ఇప్పుడు పరిస్థితి మరింత జఠిలంగా మారింది. బీబీసీ పరిధిలోని బోనకల్ మండలం ఆళ్లపాడు మేజర్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని క్రమబద్ధీకరించే రెగ్యులేటర్ నిర్మించ లేదు. ఫలితంగా తెలంగాణ భూములకు కేటాయించిన నీరు ఆంధ్రా భూములను తడుపుతోంది. దీనికితోడు నల్లగొండ జిల్లాలో కొన్నిచోట్ల ప్రధాన కాల్వ దెబ్బతినడంతో అధిక మొత్తంలో నీరు విడిచే పరిస్థితి లేదు. ఈ కారణంగా పాలేరు రిజర్వాయర్‌లో సామర్థ్యం మేరకు నీరు నిల్వ చేయలేకపోతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికితోడు నిర్వహణ పరమైన లోపాలు కూడా తీవ్రంగా ఉండటం వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే జిల్లాలోని సాగర్ ఆయకట్టులో 2.54 లక్షల ఎకరాల పంటలు చేతికి రావడం సందేహమేనని రైతాంగం వాపోతోంది.
అడుగడుగునా వృథా...
కాల్వల నిర్వహణ లోపాల కారణంగానే ఎన్నెస్పీ ఆయకట్టుకు నీరందడం లేదు. పలు చోట్ల స్లూయిస్ దగ్గర నీరు లీకవుతోంది. కాల్వల లైనింగ్ లేకపోవడం, తూములకు మరమ్మతులు చేయకపోవడంతో నీటి వృథా ఎక్కువగా ఉంటుంది. యాసంగి పంటల కోసం సాగర్ ఎడుమ కాల్వ నుంచి 63 టీఎంసీల నీరు కేటాయించారు. దీనిలో మొదటి జోన్‌లోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు మినహాయించగా ఖమ్మం జిల్లాకు 21.5 టీఎంసీలు విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 15 నుంచి 8 విడతలుగా ఈ నీటి విడుదల ప్రారంభమైంది. మంగళవారం నాటితో నాల్గో విడత ముగుస్తుంది. ఏప్రిల్ 23 వరకు పంటలకు నీరు సరఫరా చేస్తారు. ఇప్పటికే నాలుగు విడతలు పూర్తయినా చివరి ఆయకట్టులో అనేక ప్రాంతాలకు నీరందలేదని రైతులు వాపోతున్నారు.
కాల్వల నిర్వహణలో లోపాలు...
సాగర్ నీరందకపోవడానికి ప్రధాన కారణం కాల్వల నిర్వహణలో లోపాలేనని రైతాంగం అంటోంది. నల్లగొండ జిల్లాలో ప్రధాన కాల్వ కొన్నిచోట్ల దెబ్బతినడంతో ఫుల్ డిశ్చార్జి చేస్తే కాల్వ పూర్తిగా దెబ్బతింటుందని నీటి విడుదలను తగ్గించారు. ఈ కాల్వలో 6 నుంచి 9 క్యూసెక్కుల నీరు ప్రవహించాల్సి ఉండగా 3 నుంచి 5.50 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా పాలేరు జలాశయంలోనూ నీటిమట్టం తగ్గింది. రిజర్వాయర్‌లో 23 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను ప్రస్తుతం 15-16 అడుగుల నీటినే నిల్వ చేస్తున్నారు. తక్కువ నీరు ఉండటంతో ఆ నీటినే అందరికీ సరిపడా విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ మార్గంమధ్యలో అనేక చోట్ల కాల్వలు, తూములు లీకవుతున్నాయి. దీనికితోడు అక్కడక్కడా రైతులు కాల్వలకు అడ్డుకట్టలు కడుతుండటంతో కొన్ని ప్రాంతాలకు నీరందడం లేదు.
వెంటాడుతున్న లష్కర్ల కొరత..
రైతులు కాల్వలకు అడ్డుకట్టలు వేసి నీటిని మళ్లించకుండా సమపాళ్లలో సరఫరా జరిగేలా పర్యవేక్షణ చేయాల్సిన లష్కర్ల కొరత కూడా నీటిపారుదల శాఖకు సమస్యగా మారింది. జిల్లాలో 600 నుంచి 800 వరకు లష్కర్లు ఉండాల్సి ఉండగా కేవలం 140 మంది మాత్రమే ఉన్నారు. ఇటీవల 20 పోస్టులను భర్తీ చేస్తేనే ఈ పరిస్థితి ఉంది. లేదంటే వంద మంది వరకే ఉండేవారు. ప్రతి 15 కి.మీ ఓ లష్కర్ చొప్పున ఉండాల్సి ఉండగా అనేక చోట్ల ఖాళీలు వెంటాడుతున్నాయి.
చివరి ఆయకట్టులో నీటివెతలు...
నీరు తక్కువ మొత్తంలో వస్తుండటంతో చివరి ఆకట్టులో పంటలు ఎండిపోతున్నాయి. అన్నదాతలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఆందోళనలూ నిర్వహిస్తున్నారు. బోనకల్ బ్రాంచి కెనాల్లో రైతులు వివిధ రకాల వస్తువులు, చెట్ల కొమ్మలు అడ్డుగా వేసి కట్టలు ఏర్పాటు చేసి నీటిని మళ్లిస్తున్నారు. అయినప్పటికీ బీబీసీ చివరి భూములైన బోనకల్, కల్లూరు మండలాల్లో పంటలు ఎండుతున్నాయి. ఆళ్లపాడు, బోనకల్, గోవిందాపురం ఏ, రావినూతల, నారాయణపురం తదితర గ్రామాల్లో కంకిదశలో ఉన్న మొక్కజన్న ఎండిపోతుంది. వరి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతాంగం వాపోతుంది.
- మక్క ఎండుతోంది...
కౌలూ పూడేలా లేదు..
మల్లాది లింగయ్య,
కౌలు రైతు, ఆళ్లపాడు, బోనకల్
ఆళ్లపాడు మేజర్ కింద ఎకరానికి రూ.25వేలు చొప్పున 25 ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజన్న వేసిన. ఎకరానికి రూ.30వేల వరకూ పెట్టుబడి పెట్టా. ఇప్పటికే సగం రూ.3లక్షల వరకూ కౌలు కూడా చెల్లించా. 25 ఎకరాలకు గాను ఏడున్నర లక్షల పెట్టుబడి పెట్టా. సాగర్ నీరందక పంట ఎండిపోతుంది. అప్పుచేసి పంట వేస్తే ఆ అప్పుపూడే మందం కూడా వచ్చేలా లేదు.
నిర్వహణ లోపాలున్నాయి...
శంకర్‌నాయక్, చీఫ్ ఇంజినీర్, ఖమ్మం
ఎన్నెస్పీ కాల్వల నిర్వహణ లోపాలున్నాయి. అయినప్పటికీ చివరి ఆయకట్టుకూ నీరందేలా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. పైన కూడా కాల్వలు దెబ్బతినడంతో నీరు తక్కువగా విడుదల చేస్తున్నారు. ఆ మేరకు మేమూ సరఫరా చేస్తున్నాం.