Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయానికి బడ్జెట్లో భారీ కోత
- 44 కార్మిక చట్టాలను రద్దు చేసిన బిజెపి ప్రభుత్వం
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు
నవ తెలంగాణ - బోనకల్
ప్రభుత్వ రంగ సంస్థలను, వాటి ఆస్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఆప్తుడు అదానికి కారుచౌక్గా కట్టబెడుతున్నాడని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు ఆరోపించారు. మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో కార్మిక, కర్షక మండల స్థాయి సదస్సు సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి బంధం శ్రీనివాసరావు, తెలంగాణ రైతు సంఘం మండల ఉపాధ్యక్షుడు ఏడునూతల లక్ష్మణరావు అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, చట్టబద్ధత కల్పించాలని, కార్మికుల నల్ల చట్టాలను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించి కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం బిజెపి ప్రభుత్వంలో ఉన్న చట్టాలను కొనసాగించే పరిస్థితి లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా మేడే కార్మికుల దినోత్సవాన్ని కూడా బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు పని దినాల విధానాన్ని రద్దుచేసిందన్నారు. పరిశ్రమలో 200 మంది పైగా కార్మికులు ఉంటేనే సంఘాలు పెట్టుకోవాలని లేకపోతే సంఘాలు పెట్టుకోవడానికి వీలులేదని బిజెపి ప్రభుత్వం చట్టం చేయడం దారుణం అన్నారు. రానురాను యాంత్రీకరణ పెరిగి కార్మికుల సంఖ్య తగ్గిపోతుందన్నారు. 8 గంటల పని విధానాన్ని బిజెపి ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు. గతంలో లేబర్ ఇన్స్పెక్టర్లు పరిశ్రమల తనిఖీకి నేరుగా వెళ్లేవారని, కానీ ఇప్పుడు తనిఖీకి వెళ్లేటప్పుడు సంబంధించిన పరిశ్రమల యజమానికి ముందుగానే తెలియజేసి వెళ్లాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది అన్నారు. ఈ చట్టం పెట్టుబడుదారులకు ఉపయోగమన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో 160 కోట్లతో ఓ పరిశ్రమ స్థాపిస్తే అందులో కేవలం 20 మంది మాత్రమే రెగ్యులర్ సిబ్బంది ఉండగా మరో 80 మంది రోజువారి కార్మికులు ఉన్నారని, ఇది ఎక్కడ న్యాయమని వారు ప్రశ్నించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 2 లక్షల కోట్లు కోత విధించాన్నారు. 50 వేల కోట్ల సబ్సిడీని తొలగించారన్నారు. గతంలో పీఎం కిసాన్ పథకానికి 69 వేల కోట్లు కేటాయించగా దానిని ప్రస్తుత బడ్జెట్లో 60 వేల కోట్లకు తగ్గించారన్నారు. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతుల ఉన్నారన్నారు. ఇందుకు 75 వేల కోట్ల అవసరం ఉండగా 60 వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. కౌలు రైతులను ఈ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. పదివేల కోట్లతో శ్రీ అన్న యోజన పథకం కొత్తగా ప్రవేశపెట్టారని, ఇందులో రైతుల పండించే వాణిజ్యపరమైన పంటలకు స్థానం లేదన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 5వ తేదీన ఢిల్లీలో 10 లక్షల మందితో నిర్వహించనున్న కార్మిక, కర్షక ప్రదర్శన ఆందోళన కార్యక్రమంలో ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 17వ తేదీ నుంచి ప్రజాగర్జన యాత్ర ప్రారంభిం చనున్నట్లు వారు తెలిపారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు ఎంపీపీ కంకణాల సౌభాగ్యం నాయకులు గుగులోతు నరేష్, బంధం వెంకటరాజ్యం, కర్లకుంట దేవమణి, మాదినేని వీరభద్రరావు, జొన్నలగడ్డ సునీత, ఉమ్మనేని రవి, నోముల పుల్లయ్య, మందడపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.