Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమయపాలన..సమర్థవంతంగా విధులు నిర్వహించాలి
- లక్ష్యానుగుణంగా 'ఉపాధి'
- జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
చివరి ఆయకట్టుకూ సాగు నీరు అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసిలోని సమావేశ మందిరంలో నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులతో యాసంగి (రబీ) సీజన్ లో సాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత యాసంగికి సాగునీటి సరఫరా ప్రణాళికాబద్ధంగా చేయాలన్నారు. నాగార్జున సాగర్ లో తగినంత నీరు ఉందని, అవసరం మేరకు నీటి సరఫరా ఉంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఎగువ రైతులు, చివరి ఆయకట్టుకు నీరు చేరేలా సహకారించాలన్నారు. నీటిపారుదల అధికారులు దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. నీటి సరఫరా, పంపిణీ, ఎక్కడ జరుగుతుంది, దేనికి వాడుతున్నారు అనే దానిపై ఆయా నీటిపారుదల అధికారులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. డిమాండ్ ఉన్న చోట సవరింపులు చేపట్టాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా.. క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ, చురుకుగా ఉండాలని, ఏ సమస్య ఎదురైనా పరిష్కరించే విధంగా సన్నద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేవని, పగటి పూట విద్యుత్ సరఫరా పూర్తిగా జరుగుతున్నట్లు తెలిపారు. ఏ పంటకు ఏ దశలో నీరు అవసరమో అంతే వాడాలని, ఎక్కువ నీటితో జరిగే నష్టం గురించి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి, వారిలో చైతన్యం కల్పించే కీలకపాత్ర పోషించాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారుల అనుమతి లేకుండా చెరువులకు గండ్లు కొట్టడం, తూములు తెరచి నీటిని వాడుకోవడం చేయకుండా వీఆర్వోఏ లను చెరువుల వద్ద కాపలా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలు, చెరువుల వివరాలతో నివేదికను రెవిన్యూ శాఖకు అందజేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో ప్రజాప్రతినిధులతో సమా వేశాలు ఏర్పాటు చేసి పరిస్థితుల పట్ల అవగాహన కల్పించా లన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శంకర్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, విద్యుత్ శాఖ ఎస్ఇ సురేందర్, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత, నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
సమయపాలన..సమర్థవంతంగా విధులు నిర్వహించాలి
అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించి, విధులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు. ఐడిఓసిలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఫైళ్ల నిర్వహణ, పాత రికార్డులపై చర్యలు, ఈ-ఆఫీస్, పాత కార్యాలయాల ఖాళీ, కార్యాలయాల భవన సముదాయ నిర్వహణపై కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, కార్యాలయానికి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజనం ఇతరత్ర అని కార్యాలయం విడిచి వెళ్ల వద్దని అన్నారు. జిల్లా అధికారులు, వారి పరిధిలో సిబ్బందితో సమావేశమై ఈ విషయమై సూచనలు చేయాలన్నారు. అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యాలయ ఫైళ్ల నిర్వహణ ఈ-ఆఫీస్ ద్వారా చేపట్టాలని, కాగిత రహిత ఫైళ్ళతో భద్రతనే కాక, రికార్డు మార్పు చేయడానికి ఆస్కారం ఉండదని అన్నారు. కొన్ని శాఖల వారు కలెక్టరేట్ కు సమర్పించే ఫైళ్లు ఈ-ఆఫీస్ ద్వారా, మిగతా ఫైళ్లు మాన్యువల్ గా నిర్వహిస్తున్నారన్నారు. అలాకాకుండా అన్ని ఫైళ్లూ ఈ-ఆఫీస్ ద్వారానే నిర్వహించాలని తెలిపారు. పాత ఫైళ్లను విషయాన్ని బట్టి ఎల్డీస్, డీడీస్, ఆర్డీస్ గా విభజించాలన్నారు. సమయానుకూలంగా భద్రత చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వంత భవనాలు కలిగిన కార్యాలయాలు, ఐడిఓసి కి తరలిన నేపథ్యంలో, వారి పాత భవనాలు, ఇతర కార్యాలయాలకు కేటాయించిన నేపథ్యంలో, వెంటనే ఖాళీ చేసి, అప్పగించాలని కలెక్టర్ సూచించారు. కార్యాలయాలు, పరిసరాలు శుభ్రంగా ఉండాలన్నారు.
ఫైళ్లపై ఆరా..
అంతకుముందు కలెక్టర్ కలెక్టరేట్ లోని వివిధ విభాగాల పర్యవేక్షకులు, సిబ్బందితో సమావేశమై విభాగాల వారీగా రన్నింగ్ ఫైళ్లు, రికార్డు రూంలో భద్రపరచిన ఫైళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాల విభజనకు పూర్వం ఉన్న ఫైళ్లను ఏ జిల్లా ఫైళ్లను ఆ జిల్లాలకు పంపించాలన్నారు. మంచి భవనం, కంప్యూటర్లు, సదుపాయాలు కల్పించినందున విధులు మెరుగ్గా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.
లక్ష్యానుగుణంగా 'ఉపాధి'
ఉపాధిహామీ పథకం అమలు లక్ష్యాలను జిల్లాలో వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 589 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులు చేపట్టినట్లు తెలిపారు. 3,22,315 క్రియాశీలక ఉపాధి హామీ కూలీలున్నట్లు వివరించారు. వారికి తగినన్ని పని దినాలు, పనులు ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. ప్రతి మండలంలో 30 వేల లేబర్ టర్నోవర్ జరగాలన్నారు. అధికారులు ఉదయం 7 గంటలకల్లా ఫీల్డ్ లో ఉండాలన్నారు. లేబర్ సమీకరణ, పనులు జరిగేట్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. డిసిసి మెటీరియల్ కాంపోనెంట్ కింద సిసి రోడ్లకు రూ.3,058 లక్షలు, గ్రామ పంచాయతీ భవనాలకు రూ. 2,140 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. నర్సరీల్లో డిమాండ్ ఉన్న మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 3,21,336 మంది వర్కర్లకు గాను 3,20,424 మందికి ఆధార్ సీడింగ్ పూర్తి చేసినట్లు, మిగిలిన వారి ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సోషల్ ఆడిట్ కింద 132 పేరాలకు గాను రూ. 5,47,239, ఇప్పటి వరకూ రూ. 81,545 రికవరీ చేసినట్లు వివరించారు. మిగిలిన మొత్తం రికవరీకి చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం గిరి వికాసం కింద రూ. 877.58 లక్షలు మంజూరు కాగా, రూ. 690.50 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఆర్డీఓ విద్యాచందన, జెడ్పి సిఇఓ వివి. అప్పారావు, పీఆర్ ఇఇ కెవికె. శ్రీనివాస్, అదనపు డిఆర్డీఓ శిరీష, డివిజన్ పంచాయతీ అధికారులు పుల్లారావు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.