Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రివ్యూ మీటింగ్లో చైర్మెన్, కమిషనర్
నవతెలంగాణ-ఇల్లందు
వేసవికాలంలో పట్టణ ప్రజలకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ అంకుల్ షావలి తెలిపారు. ప్రజాక్షేత్రంలో పర్యటనలో భాగంగా శాసనసభ్యులు బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ వార్డులలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న క్రమంలో ప్రధానంగా నీటి సమస్యను ప్రజలు లేవనెత్తారు. దీంతో నీటి సమస్యను పరిష్కరించేందుకు వారు యుద్ధ ప్రాతిపదికంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వాటర్ సెక్షన్ అధికారులు, సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పాలకవర్గం ఏర్పడక ముందు నీటి సమస్య ఎంతుందో ప్రజలందరికీ తెలుసు అని తెలిపారు. పాలకవర్గం ఏర్పడిన తర్వాత ప్రధానంగా నీటి సమస్యపై దృష్టి పెట్టి ఎమ్మెల్యే సూచన మేరకు రోజు విడిచి రోజు పట్టణ ప్రజలకు నీళ్లు అందిస్తున్నామని తెలిపారు. గత మూడు, నాలుగు నెలల నుంచి కొంత ఇబ్బంది లేవనెత్తిన విషయం వాస్తవమేనని దాని అధిగమించేందుకే నేడు ఈ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కృషితో నిరుపయోగంగా ఉన్న కళాంజలి ట్యాంకు, కాళీ మాత వాటర్ ట్యాంకులను ఉపయోగంలోకి తీసుకువచ్చామని, నూతనంగా నిర్మించిన మిషన్ భగీరథ 12వ వార్డు వాటర్ ట్యాంక్ కూడా ఉపయోగంలోకి వచ్చిందని, అతి త్వరలో కాకతీయ నగర్, కోర్టు ట్యాంక్ కూడా అందుబాటులోకి రానున్నాయని తెలియజేశారు. వేసవికాలంలో ఎట్టి పరిస్థితిలో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని అధికారులకు తెలియజేశారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఆజాం, నవీన్ కుమార్, పద్మావతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.