Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సాబ్ ఓ సారి ఇటు చూడండి
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
రాష్ట్రం, మంత్రులు మారినా వాగుకు వంతెన మాత్రం రావడం లేదు. మండల పరిధిలోని మర్రిగూడెం రాజపురం మధ్య గల వాగుకు వంతెన రావడం లేదని ఇరు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజపురం నుండి మార్రిగూడెం మధ్య సుమారు 3 కిలోమీటర్లు తారు రోడ్డు కిలోమీటరు కోటిన్నర ఖర్చు పెట్టి పోశారు. కానీ సుమారు 30 మీటర్లు వంతెన నిర్మాణం మాత్రం మర్చిపోయినారు అధికారులు. కోట్లు రూపాయలు ఖర్చు పెట్టిన రోడ్డు అంత నాశనం అయి పోయే దశకు వస్తున సంబంధిత ఆర్అండ్బీ అధికారులు వంతెన గురించి పట్టించుకోవడం లేదని, గతంలో ఎన్నికైన శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు ఇప్పుడు వున్న శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరావు, గతంలో రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనేక సార్లు ఈ రోడ్డు మీదిగా వెళ్ళిన ఒక దశలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కారు వాగుకు వంతెన లేకపోవడంతో అదే వాగులో నుండి కారు దిగి నడిచిపోయిన సంఘటనలు ఉన్నాయి. అయినా ఏ ఒక్కరూ కూడా వాగుకు వంతెన గురించి పట్టించుకోవడం లేదని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మర్రిగూడెం రైతులు మండల కేంద్రానికి, వరి పొలాలు దగ్గరకు, పండించిన పంట ఇంటికి తీసుకుపోవాలన్నా వాగుకు 30 మీటర్లు వంతెన లేక సుమారు 12 కిలోమీటర్లు చుట్టూ తిరిగి అబ్బుగుడేం గ్రామం నుండి గాని, అన్నపురెడ్డిపల్లి నుండి గాని మర్రిగూడెం రావాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబధిత మంత్రి పువ్వాడ అజరు కుమార్ అబ్బుగూడెం ద్వజస్తంభం కార్యక్ర మానికి వస్తున్న నేపథ్యంలో మండలంలో ప్రజా ప్రతినిదులు, అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరావు మంత్రి దృష్టికి వంతెన నిర్మాణం గురించి తీసుకుపోయి, వంతెన నిర్మాణం అయ్యే విధంగా చూసి రైతులు కష్టాలు తీర్చాలని మండలంలోని పలువురు రైతులు ప్రజలు కోరుకుంటున్నారు.
వాగుకు వంతెన ఏర్పాటు చేయండి : రైతు అప్పయ్య
వర్షా కాలంలో వాగు దాట లేక ఒక యువకుడు వాగులో కొట్టుకుపోయి చెట్టు కొమ్మ పట్టుకొని ప్రా ణాలు కాపాడుకున్నాడు. వర్ష కాలంలో మర్రిగూడెం నుండి అంబులెన్స్ యర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వాగు దాట లేక చుట్టూ తిరిగి వెళ్ళిన సంఘటనలు చాలా వున్నాయి. నూతన మండలంగా అన్నపురెడ్డిపల్లి ఏర్పడిన తరువాత రాజపురం, మర్రిగూడెం మధ్య వాహనాలు అధిక సంఖ్యలో వెళుతున్నాయి. మర్రిగూడెం నుండి రాజపురం ప్రైవేట్ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు వ్యాన్ వాగు దాట లేక వర్ష కాలంలో వంతెన లేక అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. వెంటనే సంబధిత అధికారులు వంతెన నిర్మాణం చేపట్టి ప్రజలకు రవాణా సమస్య తీర్చాలి.