Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
వికలాంగుల ప్రోత్సహానికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం క్రీడా మైదనాంలో ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిఎస్ఆర్ నిధులతో వికలాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ పాల్గొని ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని వైకల్యంతో భాదపడుతున్న దివ్యాంగులకు ఈసిఐఎల్ కంపెనీ ఉపకరణాలు అందచేయడం చాలా సంతోషమన్నారు. మనిషికి వైకల్యం అడ్డుకాదని విధి ఆడిన వింత నాటకంలో కొందరు అవయవ లోపాలకు గురయ్యారన్నారు. సహాయ పరికరాలను మంచిగా వినియోగించుకోవాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో సహాయ పరికరాలు కావాలని వికలాంగులు విజ్ఞాపనలు ఇచ్చేవారని చెప్పారు. విజ్ఞాపనల ప్రకారం వికలాంగుల ఎంపిక కొరకు ఆరు నెలల క్రింతం కసరత్తు ప్రారంభించి క్యాంపులు నిర్వహించి అర్హులను ఎంపిక చేసినట్లు చెప్పారు. 405 మంది దివ్యాంగులకు వివిధ పరికరాలు అందచేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఈసిఐఎల్ కంపెనీ దివ్యాంగులకు అవసరమైన పరికరాలు ఇచ్చేందుకు ముందుకు రావడం చాలా సంతోషమని చెప్పారు. 40 లక్షల సిఎస్ఆర్ నిధులతో 741 పరికరాలను నేడు అందచేస్తున్నామని చెప్పారు. శారీరక వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఈ పరికరాలు చాలా ఉపయోగపడతా యని చెప్పారు. ఈసిఐఎల్ కంపెనీ ఇచ్చిన ఈ పరికరాలు 405 మంది జీవితాలకు ఉపయోగపడు తున్నాయని చాలా సంతోషమని చెప్పారు. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మరికొంత మంది వికలాంగులకు ఉపయోగపడే పరికరాలు అందచేస్తామని చెప్పారు. కంపెనీలు లాభాల్లో కొంత మొత్తాన్ని సమాజికంగా సమాజానికి ఉపయోగపడా లన్నదే సిఎస్ఆర్ నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు.
ఈసిఐఎల్ కంపెనీ ప్రజలకు ఉపయోగ పడే ఎన్నో పరికరాలు తయారు చేశారని చెప్పారు. ఈసిఐఎల్ ఓటు హక్కు వినియోగించే కంపెనీ ఓటింగ్ యంత్రాలను తయారు చేసిన ఘనత ఉన్నదని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ కాపు సీతాలక్ష్మి, జడ్పీ వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా, ఈసిఐఎస్ అడిషనల్ జనరల్ మేనేజర్ మునికృష్ణ, అలీం, సీనియర్ మేనేజర్ రాజేష్, ఈసిఐఎల్ సీనియర్ వైధ్యాధికారి డాక్టర్ విశ్వనాధరెడ్డి, పర్సనల్ అధికారి సునీల్ కుమార్, సీనియర్ మేనేజర్ కె.శ్రీనివాసరావు, యూనిట్ మేనేజర్ బాలకృష్ణ, స్థానిక కౌన్సిలర్ లక్ష్మణ్ వికలాంగుల సంక్షేమ సంఘ అధ్యక్షులు గుండపునేని సతీష్ తదితరులు పాల్గొన్నారు.