Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిన ఉద్యమకారులు
- నాడు సీపీఐ(ఎం) చెప్పిందే నేడు నిజమవుతుంది
నవతెలంగాణ-భద్రాచలం టౌన్
'పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే 450 గ్రామాలు జల సమాధి అవుతాయని 9 మండలాలు, మూడు లక్షల ఎకరాల సాగు భూమి, రెండు లక్షల ఎకరాల అటవితో పాటు పాపికొండల అందాలు, దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాద్రి రామాలయం కనుమరుగవుతాయని ముందే అధ్యయనం చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ(ఎం) పోరాటం చేయగా సుమారు 79 మందిపై పోలీసులు పెట్టిన హత్యాయత్నం కేసు 16 సంవత్సరాలు అనంతరం శుక్రవారం కొత్తగూడెం జిల్లా అదనపు కోర్టు న్యాయమూర్తి సరైన సాక్షా ఆధారాలు లేవని కొట్టివేశారు.'
వివరాలకు వెళ్తే 2006లో రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మించ తలపెట్టింది. ఈ ప్రాజెక్టు వల్ల భద్రాచలం డివిజన్లోని చింతూరు, విఆర్ పురం, కూనవరం, భద్రాచలం రూరల్, భద్రాచలం పట్టణంతో పాటు కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాలు పూర్తిగా జల సమాధి అయిపోతాయని ఇన్ని లక్షల మంది ప్రజలను నిర్వాసితులు చేసే ప్రమాదకర పోలవరం ప్రాజెక్ట్ నిర్మించవద్దని, తప్పని పరిస్థితుల్లో నిర్మించిన డిజైన్ మార్చి ముంపు తగ్గించే విధంగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో అనేక రకాల పోరాటాలు నిర్వహించింది.
పోలవరం సర్వేని అడ్డుకోవటంతో పాటు గ్రామ గ్రామాలలో పంచాయతీ పాలకవర్గాలు ప్రాజెక్టుకు వ్యతిరేక తీర్మానాలు చేయించారు. అప్పటి ఎమ్మెల్యే సున్నం రాజయ్య నాయకత్వంలో ముంపు ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు. తహసీల్దార్లకు, ఐటిడిఏ పీవోలకు, జిల్లా కలెక్టర్లకు తోపాటు అన్ని ప్రభుత్వ అధికారులకు వినతి పత్రా లు అందించారు. నిరాహార దీక్షలు, నిరసన దీక్షల చేశారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోగా ప్రాజెక్టు నిర్మాణం పనులను వేగవంతం చేశారు.
అసలు ఆ రోజు ఏం జరిగింది
2007 జనవరి 29 నాడు ఎన్ని పోరాటాలు నిర్వహించిన ప్రభుత్వం దిగి రాకపోవడంతో సీపీఐ(ఎం) భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అప్పటి డివిజన్ కార్యదర్శి బండారు రవికుమార్ నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులు మిడియం బాబురావు పాటు ముంపు మండలాలలోని సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధులు, పోలవరం నిర్వాసిత ప్రజలతో కలిసి భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. పోలవరానికి వ్యతిరేక ఉద్యమానికి ప్రజల్లో పెరుగుతున్న మద్దతుని పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని ఏ విధంగా అయినా అణిచివేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా లాఠీచార్జితో కార్యకర్తలపై పోలీసులు దాడికి దిగారు. సీపీఐ(ఎం) కార్యకర్తలను, ప్రజలనూ గాయపరిచారు. లాఠీఛార్జీనీ నిరసిస్తూ ఉద్యమకారులు బ్రిడ్జి సెంటర్లో శాంతియుతంగా రాస్తారోకో నిర్వహించారు.
దాంతో జిల్లా ఏఎస్పీ రమేష్ కుమార్, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పోలీస్ అధికారులచే ఉద్యమకారులపై లాఠీచార్జీతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అంతటితో ఆగకుండా ఇటువంటి హెచ్చరిక లేకుండా కాల్పులు ప్రారంభించారు. కాల్పుల్లో సీపీఐ(ఎం) కార్యకర్త కుంజ నర్సయ్య కాలికి బుల్లెట్ తలిగి కాలును కోల్పోయాడు. అనేకమంది కార్యకర్తలకు గాయాల య్యాయి. సిపిఎం ప్రధాన నాయకత్వాన్ని అక్రమంగా అరెస్ట్ చేసి అనేక రకాల కేసులతో పాటు పోలీసులను హత్యా చేసే ప్రయత్నం చేశారని 307 సెక్షన్ సహా 12 సెక్షన్లు కింద 79 మంది ప్రధాన నాయకత్వం పైన తప్పుడు కేసు నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకి తరలించారు.
17 రోజులు అనంతరం కండిషన్ బెయిల్ పై జైల్లో నుండి విడుదలైన నాయకులు నేటి వరకు కోర్టు చు ట్టూ తిరిగారు. ఈ కేసులో ఉన్న వారిలో 12 మంది ఈకాలంలో చనిపోగా 67 పోలీసులు చేసిన అభియోగాలకి సరైన సాక్ష్యా ఆధారాలు లేని కారణంగా శుక్రవారం కొత్త గూడెం జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జి నీరజ కేసుని కొట్టివే స్తూ తీర్పు చెప్పారు. ఉద్యమకారుల తరఫున న్యాయవా దులు కొల్లి సత్యనారాయణ, కే.పుల్లయ్య వాదించారు.
నాడు సీపీఐ(ఎం) చెప్పిందే నేడు నిజమవుతుంది
పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే భద్రాచలం జల సమాధి అవ్వటం ఖాయమని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్మిస్తుంటే ఏ ఇతర రాజకీయ పార్టీలు స్పందించకపోగా, అవహేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆరోజు సిపిఎం నాయకత్వం చెప్పిన మాటలు నేడు అక్షర సత్యంగా కనిపిస్తున్నాయి. 2022 జూలై, ఆగస్టు నెలలో వచ్చిన వరదలకు భద్రాచలంతో పాటు తొమ్మిది మండలాలు గోదావరి ముంపు గురైన విషయం తెలిసిందే. కేవలం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యాం పూర్తి అయితేనే ఈ స్థాయిలో ముంపు ఉంటే ప్రాజెక్టు పూర్తిగా నిర్మిస్తే భద్రాచలం భవిష్యత్తు ఏంటని ఇప్పుడు కలవరం మొదలైంది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి ముంపు తప్పదని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. 2014లో కూడా ముంపు పేరుతో మండలాలను ఆంధ్రాలో కలపడంతో కేంద్ర ప్రభుత్వ కుట్ర స్పష్టమైనది.
ముంపు నివారణ చర్యలు చేపట్టాలి
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి కలిగే నష్టాన్ని అంచనా వేసి ముందు నుంచి ఉద్యమిస్తున్న సిపిఎంకి అన్ని రాజకీయ పార్టీలు ఐక్య ఉద్యమానికి కల్సి రావాలి. ముంపుని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాటం ప్రారంభించాలి. ముంపు తగ్గించేందుకు కరకట్ట ఎత్తు వెడల్పు పెంచేందుకు నిధులు వెంటనే మంజూరు చేయాలి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీర్ల బృందంచే సర్వే చేసిన సందర్భంలో కరకట్ట ఎత్తు వెడల్పు పొడవు పెంచటానికి 832 కోట్లు ఖర్చు అవుతుందని అదేవిధంగా భూసేకరణకు 237 కోట్లు మొత్తంగా సుమారు 1600 కోట్ల ఖర్చు అవుతుందని ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఆ నిధులను కేంద్రమే విడుదల చేసి వెంటనే పనులు చేపట్టాలి. పోలీసులు పెట్టిన కేసులు, నిర్బంధాలు సిపిఎం పోరాటాన్ని ఏమాత్రం ఆపలేవని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో భద్రాచలం ఏజెన్సీ పరిరక్షణ కోసం సిపిఎం ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలకు కార్యకర్తలు సిద్ధమవుతున్నారని తెలియజేశారు.
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్