Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 67 లక్షల సొత్తు రికవరీ
- విలేకరుల సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనర్
నవతెలంగాణ-ఖమ్మం
నగరంలోని దారి దోపిడీలకు పాల్పడే ఏడుగురు మూఠా సభ్యులు, ఇండ్లల్లో చోరీ చేసే ఓ దొంగను, ఈ రెండు కేసుల్లో ఒక కేజీ బంగారం, రూ. 17,50,000 నగదు రికవరీ చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ తెలిపారు. శుక్రవారం ఖమ్మంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి మాట్లాడుతూ ఖమ్మం అర్బన్ మండలం పాండురంగాపురంనకు చెందిన సంపటి ఉమా ప్రసాద్ 8 ఇళ్లల్లో దొంగతనం చేశాడు. ఎక్కువగా రాత్రి సమయంలో చేశాడు. ఇతని నుంచి 900 గ్రాములు బంగారం, రూ.3 లక్షల నగదు మొత్తం 45 లక్ష రూపాయల విలువ గల సొత్తు రికవరీ చేసినట్లు తెలిపారు. జల్సాలు, బెట్టింగ్లకు అలవాటు పడి ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనం చేసినట్లు వివరించారు. అదేవిధంగా ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురంనకు చెందిన బైక్ మెకానిక్ పగడాల విజరు కుమార్, ఆటో డ్రైవర్స్ సండేం లక్ష్మీనారాయణ, దానవాయిగూడెంనకు చెందిన కార్ డ్రైవర్ ఎస్కె సైదులు, ఖమ్మం బికె బజార్ కు చెందిన పంచర్ షాప్ లో పనిచేసే ఎస్.డి షీబాజీ సిద్ధికి, బోనకల్ మండలం చిన్న బీరవల్లి గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ పాకాలపాటి ధర్మ తేజ, ఖమ్మం ప్రకాష్ నగర్ కుమ్మరి బజారుకు చెందిన కార్ డ్రైవర్ ఎస్.కె పర్వేజ్, ఖమ్మం అర్బన్ మండలం రామన్నపేటకు చెందిన కార్ డ్రైవర్ పసుపులేటి సాయి ముఠాగా ఏర్పడ్డారు. ఖమ్మం నగర శివ ప్రాంతాల్లో కార్లు, బైకులు ఆపి వారిని బెదిరించి వారి వద్ద ఉన్న బంగారం, నగదు దోపిడీ చేశారు. మొత్తం 8 చోట్ల దోపిడీలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందని, వారి నుంచి 150 గ్రాముల బంగారం, రూ.14,50,000 నగదు మొత్తం 22 లక్షల సొత్తు రికవరీ చేసినట్లు తెలిపారు. కేసు చేధించిన పోలీసులకు కమిషనర్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిసిఎస్ ఎసిపి రవి, ఖమ్మం నగర ఎసిపి గణేష్, ఖమ్మం రూరల్ ఎసిపి బస్వా రెడ్డి, సిఐలు మల్లయ్య స్వామి, నవీన్, శ్రీనివాసరావు, శ్రీధర్, రామకృష్ణ, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.