Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయప్రదం చేయండి : ప్రజా సంఘాల నేతల పిలుపు
- మారని పేదల బతుకులు
- ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు ధారాదత్తం
నవతెలంగాణ-నేలకొండపల్లి
బ్రిటీష్ బానిస పాలనపై భగ్గుమన్న నాటి ఉద్యమ వీరులు పోరాడి సాధించుకున్న 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో నేటికీ పేదల బతుకులు మారకపోగా బానిస బతుకులు కొనసాగుతున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిపుష్టికి సర్వతో ముఖాభివృద్ధికి ఆయువుపట్టుగా నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా దారాదత్తం చేస్తుందని మండిపడ్డారు. దేశంలోని 140 కోట్ల మంది జనాభాకు చెందిన సంపద మొత్తం కేవలం 10 శాతం మంది కార్పొరేట్ శక్తుల చేతుల్లో పోగుబడి ఉందన్నారు. ఫలితంగా దేశంలో నానాటికి పేదరికం, నిరుద్యోగం, ఆకలి చావులు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫారసులన అమలు చేసి వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలవాల్సిందిపోయి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తుందన్నారు. సేంద్రియ సాగు ముసుగులో వ్యవసాయ రంగానికి అందించాల్సిన ఎరువులు, విత్తనాల సబ్సిడీలను ఎత్తివేస్తుందన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వేయి శిరసుల విషపు నాగులాంటిదని అభివర్ణించారు. అటువంటి బిజెపి శిరస్సులను ఖండించి కోరలు పీకాల్సిన సమయం ఆసన్నమైనదన్నారు. బిజెపి అసమర్థ విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5న రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని, ఈ సందర్భంగా చేపట్టిన మహార్యాలీని జయప్రదం చేయాలని, అందులో భాగంగా ప్రతి గ్రామంలో వినూత్న రూపంలో ప్రజలను చైతన్యవంతం చేసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు ఇంటూరి అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కేవీ రామిరెడ్డి, దుగ్గి వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు ఏటుకూరి రామారావు, పగిడికత్తుల నాగేశ్వరరావు, సిరికొండ ఉమామహేశ్వరి, మారుతి కొండలరావు, మందడపు మురళీకృష్ణ, డేగల వెంకటేశ్వరరావు, బండి రామమూర్తి, ఎరదేశి నరసింహారావు, శివరాజు, గాదె వెంకటేశ్వరరావు, చింతలపాటి భాస్కర్, దండా సూర్యనారాయణ, సిరికొండ నాగేశ్వరరావు, సామల మల్లికార్జునరావు పాల్గొన్నారు.