Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబ్ధిదారులకు ఇస్తే తీసుకుంటారా?
- ఐటీడీఏ జేఈపై కలెక్టర్ గౌతమ్ ఆగ్రహం
- పర్యవేక్షణ జరపమని ఆర్డీవోకు ఆదేశం
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లిలోని వేంసూరు రోడ్డులో నిర్మాణం జరుగుతున్న జీప్లస్టూ స్థాయి డబుల్ బెడ్రూం ఇండ్లను జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ శనివారం పరిశీలించారు. మొదట్నుంచీ ఇక్కడ చేపట్టిన డబుల్ నిర్మాణం నాసిరకంగానే జరుగుతోందని పలు విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం సత్తుపల్లి పర్యటనకు వచ్చిన కలెక్టర్ నిర్మాణ సముదాయాని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవనాలు మొత్తం కలియదిరిగిన కలెక్టర్ పనులను చూసి ఐటీడీఏ జేఈ సుబ్బరాజుపై నిప్పులు చెరిగారు. భవన సముదాయం ముందు ఉన్న డస్ట్ను చూసి దేనికి వాడుతున్నారని ప్రశ్నించగా, కాంక్రీట్లో డస్ట్ను వాడుతున్నట్లు సుబ్బరాజు చెప్పారు. దీంతో కలెక్టర్ నిర్ఘారతపోయారు. ఇదేం నిర్మాణం అని నిలదీశారు. ఎప్పుడు పూర్తి చేస్తావ్. నీవల్ల అవుతుందా, అంటూ గరమయ్యారు. ఎప్పుడు అడిగినా ఇదిగో అదిగో అంటున్నావ్ అంటూ మండిపడ్డారు. ఎక్కడ చూసినా దుబ్బకొట్టుకు పోయినా ప్లాట్లు, నాసిరకం మెటీరియల్, మొక్కుబడి పనితీరుపై పెదవి విరిచారు. లబ్ధిదారులకు ఇలాంటి ఇండ్లు ఇస్తే తీసుకుంటారా అని ప్రశ్నించారు. కలెక్టర్ ప్రశ్నలకు జేఈ సుబ్బరాజు నీళ్లు నమిలారు. సార్ సార్ అనడం తప్ప మరే సమాధానం చెప్పలేకపోవడం గమనార్హం. పనితనం మార్చుకోకుంటే తొలగించడం తప్ప మరో దారిలేదని హెచ్చరించారు. ఇక్కడి నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలంటూ ఆర్డీవో సూర్యనారాయణను కలెక్టర్ ఆదేశించారు.