Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లిలో లైబ్రరీ నిర్మించే అవకాశం
- నాకు రావడం భగవధానుగ్రహం
- ఆధునిక హంగులతో డిజిటలైడ్జ్ చేయిస్తా
- రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధిరెడ్డి
- బండి మన ప్రాంతవాసి కావడం అదృష్టం
- ఎమ్మెల్యే సండ్ర
- సత్తుపల్లిలో జీప్లస్వన్ స్థాయి లైబ్రరీకి శంకుస్థాపన
నవతెలంగాణ- సత్తుపల్లి
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, సరస్వతీ నిలయాలని రాజ్యసభ సభ్యులు, హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి అన్నారు. సత్తుపల్లి నడిబొడ్డున సొంత నిధులతో చేపట్టనున్న అత్యాధునిక (డిజిటల్) టైబ్రరీకి బండి శనివారం స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పార్థసారధిరెడ్డి మాట్లాడారు. సత్తుపల్లిలో గ్రంథాలయాన్ని నిర్మించే అవకాశం తనకు రావడం భగవధానుగ్రహం అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా సత్తుపల్లిలో అత్యాధునిక హంగులతో గ్రంథాలయాన్ని నిర్మించి సత్తుపల్లి, పరిసర ప్రాంత ప్రజలకు అంకితం చేస్తానన్నారు. రాబోయే తరాల అవసరాలకు అనుగుణంగా సత్తుపల్లి లైబ్రరీని తీర్చిదిద్దుతానన్నారు. శంకుస్థాపన చేయడం ముఖ్యం కాదని, త్వరగా నిర్మాణం చేపట్టి ప్రారంభించడమే ముఖ్యమన్నారు. ప్రారంభం నాటికి అన్ని సౌకర్యాలను సమకూర్చడం జరుగుతుందన్నారు. విద్యార్థిగా ఎంతో కష్టాలు చవిచూశానన్నారు. 6 కిలోమీటర్ల దూరం నుంచి సైకిలుపై సత్తుపల్లికి వచ్చేవాడినన్నారు. ఆరోజు మంచిగా చదవుకోబట్టే స్వశక్తితో అభివృద్ధి చెందానన్నారు. చదువు లేకుంటే అభివృద్ధి చెందడం సాధ్యపడదన్నారు. విద్యకు తాను అత్యంత ప్రాధాన్యత ఇస్తానని, ఆ ఉద్ధేశంతోనే ఈ ప్రాంత విద్యార్థులకు, ప్రజలకు జ్ఞాన సంపదను అందించేందుకు గ్రంథాలయాన్ని నిర్మించేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు. మనమెంత అభివృద్ధి చెందినా సమాజానికి ఏ విధంగా సహకరించామన్నదే ప్రధానమన్నారు. సంపాదనతో పేరు ప్రఖ్యాతలు రావని, సంపద గుర్తింపుకు కొలమానం కాదని, చేసే సేవా కార్యక్రమాలే నాలుగు కాలాల పాటు గుర్తుండి పోతాయన్నారు. ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ బండి పార్థసారధిరెడ్డి మన ప్రాంతవాసి కావడం మన అదృష్టమన్నారు. ఆయన చేసిన, చేస్తున్న సేవలు సమాజహితం కోరే విధంగా ఉంటున్నాయన్నారు. ఇక్కడి లైబ్రరీ నిర్మాణమే కాకుండా ఆయన జన్మించిన సొంత ఊరు వేంసూరు మండలం కందుకూరులో అత్యాధునిక సౌకర్యాలతో జూనియర్ కళాశాలకు ఇటీవలే శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఆయన సేవలు ఈ ప్రాంత ప్రజలకు మరింతంగా అందించాలని ఆకాంక్షించారు. వచ్చే ఆగస్టు 15 నాటికి గ్రంథాలయ నిర్మాణం పూర్తయ్యేలా కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా సండ్ర అన్నారు. గ్రంథాలయం నిర్మాణానికి అడగ్గానే స్థల సేకరణ జరిపి అందరికి అందుబాటులో ఉండే స్థలాన్ని చూపించిన కలెక్టర్ గౌతమ్‌కు సండ్ర ధన్యవాదాలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, కమిషనర్ కోడూరు సుజాత, బీఆర్ఎస్ నాయకులు చల్లగుండ్ల కృష్ణయ్య, ఎస్కే రఫీ, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం సత్తుపల్లిలోని పలు వార్డుల్లో సీసీరోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే సండ్ర ఎంపీ బండితో కలిసి శంకుస్థాపనలు చేశారు.