Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడెక్కిన మహిళలు
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
గుక్కెడు మంచినీళ్ల కోసం గూడెం ప్రజలు అల్లాడి పోతున్నారు. నీటి కష్టాలు తీర్చడంలో పురపాలక ప్రజాప్రతినిధులు మాత్రం నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజలు గుక్కెడు నీటి కోసం అగచాట్లు పడుతుంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు మొద్దునిద్ర వ్యవహరిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ మండిపడ్డారు. శనివారం బస్టాండ్ సమీపంలో పట్టణంలోని చిల్డర్న్స్ పార్క్ ఎదురుగా కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యపై 'కిన్నెరసాని జలదీక్ష' పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. అపరభగీరధుడిగా చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యే కిన్నెరసాని నీటి సమస్యను కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారానికి రూ.130 కోట్ల నిధులు మంజూరు అవుతున్నాయని ప్రకటించారని గుర్తు చేశారు. నెలలు గడుస్తున్నా నేటికి ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదని, ఎమ్మెల్యే ఉత్తర కుమార ప్రగల్బాలు పలకడం మాని చిత్తశుద్ధితో పని చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ గంధం మల్లికార్జునరావు, సాయి, అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు కోలా మల్లికా, కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్, కేతిని కుమారి, మాలోత్ భానుమతి తదితరులు పాల్గొన్నారు.
పలువురు మద్దతు....
ఈ దీక్షలకు టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాధం, ఏజెన్సీ పరిరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు లాల్ సింగ్ నాయక్, ఎల్ఎచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్, రమేష్ నాయక్, జనసేన రాష్ట్ర నాయకులు నౌతన్, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కురిమిళ్ల శంకర్, తెలంగాణ విభిన్న ప్రతిభ వంతుల సంఘం అధ్యక్షుడు సతీష్ గుండపునేని, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు మూతి రామకృష్ణ తదితరులు మద్దతు తెలిపారు. దీక్షలను స్వేరోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకబత్తిని వీరయ్య నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు.