Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అస్తవ్యస్తంగా ఉన్న మంచినీటి సరఫరాను సరిచేయాలి
- మండలపరిషత్ సమావేశం ముందు సీపీఐ(ఎం) ధర్నా
నవతెలంగాణ-చర్ల
మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని, అన్ని గ్రామాలకు మంచినీళ్లు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.బ్రహ్మచారి మాట్లాడారు. మండలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని మండల పరిషత్ సమావేశంలో తీర్మానం చేయాలని ఆ తీర్మానాన్ని కలెక్టర్‌కి పంపించాలని డిమాండ్ చేశారు. తరచూ అగ్ని ప్రమాదాలు జరిగి లక్షలాది రూపాయల ప్రజల ఆస్తి నష్టం జరుగుతుందని తెలిపారు. మండల పరిషత్ సమావేశంలో సీపీఐ(ఎం) సుబ్బంపేట, బోధనెల్లి, పెద్దపల్లి సర్పంచులు ఏక.సుజాత, మడివి.సంధ్య, కల్లూరి.సమ్మక్కలు సమస్యలపై ఫ్లకార్డులతో సర్వసభ్య సమావేశంలో నిరసన తెలియజేశారు. మండలంలో మిషన్ భగీరథ మంచినీళ్లు సరఫరా మొత్తం అస్తవ్యస్తంగా తయారైందని సీపీఐ(ఎం) పేర్కొన్నది. విజయ కాలనీలో సంవత్సర కాలంగా వాల్ కూడా వేయలేదని తెలిపారు. కలివేరు రాజబలి కాలనీలో మంచినీటి బోర్లు వేసి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఇంత మిషన్ భగీరథ అధికారులు బోర్లు వేయలేదని నీళ్లు ఇవ్వలేదని తెలిపారు. మండల కేంద్రమైన సాయి కాలనీ, విజరు కాలనీ, అంబేద్కర్ నగర్, పాత చర్ల వంటి కాలనీలో నీళ్లు రావడం లేదని ఇంకా కొన్ని కాలనీలకు పైపులైన్లు కూడా వేయలేదని సీపీఐ(ఎం) పేర్కొన్నది. చిన్న మిడిసి లేరు, చింతగుప్ప, పూసగొప్ప, కూర్నపల్లి, పంచాయతీలోని మరికొన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని సమస్యను అధికారులకు చెప్పినా స్పందించడం లేదని తెలిపారు. తేగడ పంచాయతీలో జంగాలపల్లికి రోడ్డు నిర్మాణం చేయాలని, సుబ్బంపేట పంచాయతీలో బిఎస్ రామయ్య నగర్‌కు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు తీర్మానం చేసి కలెక్టర్ పంపిస్తాం
పది రోజుల్లో మంచినీటి సమస్యను పరిష్కారం చేస్తాం
చర్లలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి కలెక్టర్‌కి పంపిస్తామని ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీపీ గీదె కోదండ రామయ్య హామీ ఇచ్చారు. అలాగే 10 రోజుల్లో మంచినీటి సమస్యను చక్కదిద్దుతామని సమస్యను పరిష్కరించి మంచినీళ్లు సక్రమంగా అందిస్తామని మిషన్ భగీరథ డీఈ ఏసుబాబు హామీ ఇచ్చారు. ధర్నా వద్దకు వచ్చిన అధికారులు వినతి పత్రాన్ని స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం నరేష్ అధ్యక్షత వహించగా పార్టీ మండల కమిటీ సభ్యులు మచ్చా రామారావు, పి.సమ్మక్క, బందెల చంటి, బోధనెల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ మడివి సంధ్య, సుభంపేట సర్పంచ్ యాకా సుజాత, చర్ల మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ శివ, మేజర్ పంచాయతీ వార్డు మెంబర్ హరి నాగ వర్మ, నాయకులు బాలాజీ, షారోని, సారయ్య, పలక సూరమ్మ, మూర్తి మడివి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.