Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటేటా పెరుగుతున్న రాబిస్ బాధితులు
- ఆ ఆరేడు నెలల్లోనే అధిక కేసులు
- స్టెరిలైజేషన్ ప్రక్రియలో లోపాలే కారణం!
- దుర్ఘటనలు జరిగినప్పుడే యంత్రాంగంలో చలనం
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కుక్కల నియంత్రణ విషయంలో ప్రభుత్వానికి సరైన శ్రద్ధ లేకపోవడమే ప్రాణాల మీదకు తెస్తోందని...రాబిస్ బాధితుల సంఖ్య పెరగానికి కారణమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంతానోత్పత్తి నియంత్రణ (స్టెరిలై జేషన్) లో లోపాలే కుక్కకాట్ల బాధితుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా ఆడకుక్కలకు ప్రతి ఆరు నెలలకోసారి పీరియడ్స్ (రక్తస్రావం) అవుతుం టాయి. ఆ సమయంలో ఒక్కో ఆడ కుక్క చుట్టూ ఐదారు మగ కుక్కలు చేరుతాయి. అలాంటి సందర్భంలోనే ఎక్కువ గా కుక్కకాట్లు చోటుచేసుకుం టున్నాయని గత మూడేళ్ల గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈ విషయాన్ని పశుసంవర్థకశాఖ నిపుణులు కచ్చితమని ధ్రువీకరించకపో యినా...ఇది తీసిపారేసే అంశం కాదని మాత్రం అంటు న్నారు. స్టెరిలైజేషన్ ప్రక్రియ సజావుగా జరిగితే కుక్కకాట్ల ను చాలా వరకు నియంత్రించవచ్చని జంతుసంరక్షకుల మాట. ఆర్నెళ్లకోసారి కుక్కలు యద కొస్తుంటాయని ఆ సమయంలో ఒకింత ఆవేశపూరితంగా వ్యవహరిస్తుంటా యని నిపుణులు చెబుతున్నారు. గత మూడేళ్లలో కుక్కకాట్లతో ఖమ్మం జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చిన బాధితుల సంఖ్యను బట్టి చూస్తే ఇదే విషయం రూడి అవుతుంది.
మూడేళ్లుగా ఏటేటా పెరుగుతున్న
కుక్కకాటు బాధితులు...
మూడేళ్లుగా కుక్కకాటు బాధితులు ఏటేటా పెరుగుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే 240 కేసులు నమోదయ్యాయి. గడిచిన రెండు రోజుల్లో శుక్రవారం 11, శనివారం 13 మంది కుక్కకాటు వ్యాక్సిన్ కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చారు. గడిచిన మూడేళ్లలో ఈ సంవత్సరం 11 నెలల్లోనే 1854 కేసులు నమోదవడం గమనార్హం. మూడేళ్లలో నెలల వారీగా కుక్కకాటు బాధితులను పరిశీలిస్తే...
సంతాన నియంత్రణ లోపాలు...
కుక్కలకు స్టెరిలైజేషన్ చేసే క్రమంలో అనేక లోటుపాట్లు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా క్యాచర్లు ఒక వీధి నుంచి పట్టుకెళ్లిన కుక్కలను తిరిగి అదే బజార్లో వదలట్లేదు. పట్టుకెళ్లిన కుక్కల్లోనూ కొన్నింటికి మాత్రమే సంతాన నియంత్రణ ప్రక్రియ పూర్తి చేస్తున్నారని...ఆ క్రమంలో వాటిలో కొన్ని తప్పించుకుంటున్నాయని జంతుసంరక్షుకులు అంటున్నారు. ఖమ్మంలోని ఓ జంతు సంరక్షణ కేంద్రం నుంచి 20 కుక్కలను సంతానోత్పత్తి నియంత్రణ (స్టెరిలైజేషన్) కోసం కొద్దినెలల క్రితం తీసుకెళ్లారు. దానిలో 11 కుక్కలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేసి తిరిగి ఆ సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. మిగిలిన తొమ్మిదింటిలో ఓ ఐదు కుక్కలకు స్టెరిలైజేషన్ చేయకుండానే తీసుకురాగా...నాలుగు డాగ్స్ బయటివి తీసుకొచ్చి సంరక్షణ కేంద్రానికి ఇచ్చారు. రోటరీనగర్‌లోని జంతుసంరక్షణ కేంద్రంలో స్టేరిలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఆ కుక్కల్లో కొన్నింటిని గోపాలపురం దాటాక వదులుతున్నారు. కొన్నింటినీ వాటికి సంబంధం లేని వీధిలో వదులుతుండటంతో అవి ఆకలితో అలమటిస్తున్నాయి. ఒక వీధి కుక్క మరో వీధికి రావడంతో వాటిమధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఒక కుక్క మరో కుక్కను కరవడంతో రాబిస్ ప్రభావం అధికమవుతోంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో కుక్కలు పిచ్చి చేష్టలకు దిగుతున్నాయి. ఆ సమయంలో ఎవరు దానికి అందుబాటులోకి వస్తే వారిని కరుస్తున్నాయని జంతుసంరక్షకులు అంటున్నారు. అలాకాకుండా ఏ బజార్ నుంచి తీసుకెళ్లిన కుక్కను స్టెరిలైజేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఆ వీధిలో వదిలితే...ఏ ఇంటి దగ్గరకు వెళ్తే ఆహారం దొరుకుతుంది...ఆహారం కోసం ఎక్కడెక్కడ అన్వేషించాలో వాటికి తెలుస్తుందని అంటున్నారు. హైదరాబాద్‌లో చోటుచేసుకున్నటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడే కాకుండా మిగిలిన సమయంలోనూ ఓ క్రమపద్ధతిలో కుక్కల నియంత్రణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కుక్కకాటు బారిన పడితే...
కుక్కకాటు బారిన పడిన వెంటనే ఆ ప్రాంతాన్ని ఓ 15 నిమిషాల పాటు స్వచ్ఛమైన నీటిలో కడగాలి. ఆ తర్వాత యాంటీ రాబిస్ ఇంజెక్షన్ చేయించుకోవాలి. కోతులు, పందులు, ఎలుకలు, పందికొక్కులు...ఇలా ఏది కరిసినా యాంటి రాబిస్ వ్యాక్సిన్ చేయాల్సిందే. కుక్క కరిచిన రోజు 0 అనుకుంటే...3, 7, 14, 28 ఇలా ఐదు డోసులు తీసుకోవాలి. ఒక వాయిల్ ఐదుగురికి ఇవ్వవచ్చు. ఒకసారి వాయిల్ ఓపెన్ చేశాక...మందు మిగిలినా నిల్వ చేయడానికి వీల్లేదు. ఒకవేళ నడుంకు పైభాగంలో కుక్కలు, కోతులు కరిసినా...లేదంటే కండలేచే విధంగా బాడిలో ఎక్కడ కరిస్తే అక్కడే యాంటి రాబిస్ హిమినోగ్లోబిన్ ఇవ్వాల్సి ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు.
వంద కుక్కలను సాకుతున్నా...
మేకల పద్మ, జంతు సంరక్షకురాలు
వంద కుక్కలను సాకుతున్నా. వాటి కోసం దాన్వాయిగూడెంలోఓ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశా. ఇళ్ల మధ్య ఉండటంతో స్థానికుల నుంచి కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. నాలాంటి వాళ్లకు నగరానికి సమీపంలో ప్రభుత్వం స్థలం చూపిస్తే జనానికి ఆటంకం కలగకుండా...నగరానికి దూరంగా జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటాను. ప్రజలకు కూడా కుక్కల నుంచి రక్షణ కల్పించేందుకు నావంతు కృషి చేస్తా. ఇదే విషయమై పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా దయ చూపట్లేదు.
కుక్కలు ప్రతి ఆర్నెళ్లకోసారి ఈనుతాయి...
డాక్టర్ కిషోర్ కుమార్, జిల్లా కేంద్ర వెటర్నరీ ఆస్పత్రి
కుక్కలు ప్రతి ఆర్నెళ్లకోసారి సంతానోత్పత్తి చేస్తాయి. ఒక్కో కుక్క ఒక్కటి మొదలు ఏడెనిమికి పైగా పిల్లలను పెడుతుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి...జూన్, జూలై, ఆగష్టు మాసాల్లో కుక్కలు ఎక్కువగా సంతానోత్పత్తి సంబంధిత వ్యాపకాల్లో ఉంటాయి. ఆడ కుక్కలకు పీరియడ్స్ సమయం వచ్చినప్పుడు మగ కుక్కలు ఐదారు దాని వెంట చేరుతాయి. అవి పరస్పరం తలపడుతాయి. ఆ సమయంలో వాటికి ఆటంకం ఏర్పడితే కరిచే ప్రమాదం ఉంది. ఫీమేల్ డాగ్స్ కన్నా మేల్ డాగ్స్‌కు స్టెరిలైజేషన్ చేయడం సులువు. ఈ స్టెరిలైజేషన్ సమయంలో కొన్ని కుక్కలు మిస్ అవుతుంటాయి. అవే సంతానోత్పత్తిని పెంపొందిస్తాయి.