Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎంహెచ్ హాస్టల్ ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు విడుదల
- సమ్మె విరమించిన కార్మికులు
నవతెలంగాణ-భద్రాచలం
సీఐటీయూ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ పీఎంహెచ్ హాస్టల్ ఔట్సోర్సింగ్ కార్మికులు బకాయి వేతనాల కోసం జనవరి 3 నుంచి ప్రారంభించిన నిరవధిక సమ్మె పోరాటం ఫలించింది. కార్మికుల వేతనాల కోసం ఒక కోటి 11 లక్షల రూపాయలు భద్రాచలం ఐటీడీఏకు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 కోట్ల రూపాయలను వేతనాల కోసం ప్రభుత్వం విడుదల చేసింది. 22 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని జనవరి 3 నుండి సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ నిరవధిక సమ్మెను ప్రారంభించింది. సమ్మె ప్రారంభం అయిన తర్వాత రెండుసార్లు హైదరాబాదులోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. జిల్లాలో పినపాక, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లందు ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ఖాళీ కంచాలతో మూడుసార్లు ధర్నాలు నిర్వహించారు. పట్టు వదలకుండా సిఐటియు అండదండలతో హాస్టల్ వర్కర్లు నిర్వహించిన పోరాటం ఫలితంగా వేతన బకాయిలకు సంబంధించిన బడ్జెట్ విడుదల చేశారు. డీడీ రమాదేవి కార్మికులతో చర్చించి బడ్జెట్ కాపీని అందజేసి సమ్మెను విరమింప చేశారు. సోమవారం లేదా మంగళవారం నాటికి వచ్చిన బడ్జెట్ మొత్తం వేతనాలను కార్మికుల ఎకౌంట్లో జమ చేస్తామని తెలిపారు. అయితే ఇంకా మిగిలిన 10 నెలల వేతనాలకు కూడా వెంటనే బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయి వేతనాల కోసం పోరాడిన విధంగానే బహుళ రూపాల్లో పిఆర్సి అమలు కోసం జీవో నెంబర్ 527 రద్దు కోసం దశల వారి పోరాటాలు నిర్వహిస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి తెలిపారు. పోరాడి విజయం సాధించిన ఔట్సోర్సింగ్ కార్మికులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి అజ్మీరా హీరాలాల్, నాయకులు జోడి లక్ష్మి, నాగమణి, నోపా శ్యామల, శ్రీను, రాములు, ధర్మమ్మ, సావిత్రి, భద్రమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జనవరి మూడు నుండి ప్రారంభించిన సమ్మెను విరమించి కార్మికులందరూ విధుల్లో చేరుతున్నట్లు డీడీకి తెలియజేయడం జరిగింది.