Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్
నవతెలంగాణ-పినపాక
అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని మార్చి 1 తేదీ నుండి సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మెకు సహకరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజె.రమేష్ కోరారు. శనివారం పినపాక మండలం రైతు వేదికలో అంగన్వాడి టీచర్లు, ఆయాలతో ఆయన సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అంగన్వాడీ టీచర్ల 20 డిమాండ్లను పరిష్కరించాలన్నారు. అంగన్వాడీలకు సంబంధించిన కేంద్రంలో ప్రభుత్వం పెంచిన జీతాలను వెంటనే చెల్లిస్తూ మిగతా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించని యెడల మార్చి 1,2,3 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఐసీడీఎస్‌లో పనిచేస్తూ చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు సేవలు అందిస్తున్నా న్యాయపరమైన డిమాండ్లు నెరవేరలేదన్నారు. టీచర్లతో సమానంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ఎరియర్స్ 2021 జులై, అక్టోబర్, నవంబర్ మూడు నెలలవి వెంటనే చెల్లించాలన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఈ సమస్యల పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. వేసవి కాలంలో ప్రభుత్వ పాఠశాలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కరకగూడెం మండల కార్యదర్శి కాంతారావు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.