Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పువ్వాడ
నవతెలంగాణ-అశ్వారావుపేట
పల్లెల్లోనూ పట్టణాల్లో మాదిరి కార్పొరేట్‌కు దీటుగా పేదలకు విద్యను అందించడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని ఇందు కోసమే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 'మన ఊరు-మనబడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంతో అమలు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. పాఠశాల పునరుద్ధరణతో మంచి ఫలితాలు అంది వస్తున్నాయని, సకల సౌకర్యాలతో కార్పొరేట్‌కి ధీటుగా ప్రభుత్వ విద్యను ప్రతి పేద వానికి అందిస్తామని ఆయన అన్నారు. శనివారం అశ్వారావుపేట నియోజకవర్గం, అశ్వారావుపేట మండలం, అచ్చుతాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.16.92 లక్షలతో తీర్చిదిద్దిన ప్రాధమిక పాఠశాల భవన సముదాయాన్ని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఇదే ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పలువురి జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశ పడతారని చెప్పారు. అలాంటి వారి ఆశ, కోరికలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించి నాణ్యమైన, ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించాలని కేసీఅర్ నిశ్చయించుకుని, మన ఊరు మన బడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ పథకం కింద తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1,240 ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ రకాల సదుపాయాలు కల్పించడం జరిగిందని, విడతల వారీగా ఎంపిక చేసిన అన్ని పాఠశాలలో పూర్తి స్థాయి సకల సదుపాయాలు కల్పించి కార్పొరేట్‌కి ధీటుగా విద్యను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పి వైస్ చైర్మన్ కంచర్ల చంద్ర శేఖర్ రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ డిండిగాల రాజేందర్, జడ్పీ సీఈఓ విద్యాలత, డీఈఓ సోమశేఖర్ శర్మ, ఐబీ ఎస్.ఈ సురేష్ కుమార్, డీహెచ్ఎస్ఒ మరియన్న, ఎన్పిడిసిఎల్ ఎస్ఈ శేషాద్రి, తహశీల్దార్ లూదర్ విల్సన్, ఎండీఓ విద్యాధరరావు, ఎంపీపీ శ్రీరామమూర్తి, జెడ్పీటీసీ వరలక్ష్మి, ఎంపీటీసీ దుర్గ, సర్పంచ్ నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.