Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాటాలతోనే సాధించాం... సాధించుకుందాం..
- టీజీఎస్ నేత రమావత్ శ్రీరాంనాయక్
- తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఉండాలి
- పోరాట పటిమ గల సంఘం టీజీఎస్
- గిరిజన హక్కులకు మోడీ అడ్డు
- వైరా ఎమ్మెల్యే రాములునాయక్
- సంప్రదాయ నృత్యాలతో ర్యాలీ
నవతెలంగాణ-కారేపల్లి
గిరిజన సమస్య పరిష్కారమే ఏజెండాగా గిరిజన సంఘం అవిర్భవం జరిగిందని, ఎన్నో లాఠీ దెబ్బలు, నిర్భంధాలు ఎదుర్కొని చాలా సమస్యలు పరిష్కారం సాధించుకు న్నామని, పాలకుల నిర్భÛంధాలకు తగ్గేది లేదని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరాంనాయక్ అన్నారు. తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) ఖమ్మం జిల్లా మహాసభ కారేపల్లిలో శనివారం అట్టహాసంగా జరిగింది. బానోత్ బాలాజీ అధ్యక్షతన జరిగిన మహాసభలో రమావత్ శ్రీరాంనాయక్ మాట్లాడుతూ 20 సంవత్సరాల పోరాట ఫలితంగా పోడుహక్కులు సాధించుకుంటున్నామని, హక్కుల కోసం దేశద్రోహం కేసులు, నెలల తరబడి జైలులో మగ్గిన చరిత్ర తెలంగాణ గిరిజన సంఘం నేతలదన్నారు. పోడు కోసం పోరాటం చేస్తున్న పేదల పక్షాన నిలిచి వారికి అండగా నిలిచిందన్నారు. తండాలను పంచాయతీలుగా చేయాలని గిరిజన సంఘం పోరాడిందని, నూతన తండా పంచాయతీ ఒకదానికి రూ.5 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తండాల అభివృద్ధికి కర్ణాటక రాష్ట్ర తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ గిరిజనులకు చేసింది ఏమి లేదన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టటానికి గద్దలాగా వాలుతుంటారన్నారు.
గిరిజన హక్కులకు మోడీ అడ్డు
: వైరా ఎమ్మెల్యే రాములునాయక్
తెలంగాణ గిరిజన సంఘం పోరాట పటిమగల సంఘమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ కొనియాడారు. గిరిజన సంఘం మహాసభకు ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పోడు హక్కుల కోసం గిరిజన పోరాటం స్పూర్తిదాయకమన్నారు. గిరిజన బాధలు తెలిసిన నేత కేసీఆర్ పోడుకు హక్కు కల్పించటానికి పూనుకున్నారని, త్వరలో అన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పోడు పట్టాల పండుగ చేసుకుందామన్నారు. పోడుకు హక్కులిచ్చి గిరిజనులు ఆశీర్వాదంను సీఎం కేసీఆర్ తీసుకుంటారన్నారు. గిరిజన జాతీ ఐక్యతతోనే పటిష్టం అవుతుందన్నారు. గిరిజన హక్కులకు మోడీ అడుగడుగున అడ్డు పడుతున్నారని విమర్శించారు. అటవీ హక్కుల దక్కకుండా అటవీ సంరక్షణ నియమావళి తీసుకవస్తుందని, తెలంగాణ రాష్ట్ర ఫ్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమోదించకుండా అడ్డు చెప్పుతుందని ఆక్షేపించారు. 33 గిరిజన తెగులు కలిసి వేదిక పంచుకుందామని, కలహించుకుంటే హక్కులు హరించబడతాయన్నారు. గిరిజన రక్షణకు ఉన్న చట్టాలను దుర్వినియోగం చేసి సమాజానికి చులకన కావద్దని హెచ్చరించారు. పోడు సాగు చేస్తున్న గిరిజనేతరులు ఎవరూ ఆదైర్య పడవద్దని వారికీ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇస్తున్నారన్నారు.
ప్రభుత్వ హామీలు అమలు చేయాల్సిందే : గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రంనాయక్ డిమాండ్ చేశారు. గిరిజన సంఘం జిల్లా 3వ మహాసభలో తీర్మాణాలను అయన ప్రవేశ పెట్టారు. జిల్లా పునర్విభజన సందర్భంగా ఖమ్మం జిల్లాకు ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. దానిని వెంటనే అమలు చేయాలని, చేయించాల్సిన బాధ్యత గిరిజన ప్రజాప్రతినిధులు తీసుకోవాలని కోరారు. ఐటీడీఏ లేక జిల్లా గిరిజనులు సంక్షేమ పధకాలకు దూరం అవుతున్నారన్నారని ఆవేదన వ్యక్తర చేశారు. విద్యతోనే గిరిజన జాతీ మనుగడ ఆధారపడి ఉందని, ఏజన్సీలో అశ్రమ పాఠశాలల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏజన్సీ ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల ఉపాధీ ముడిపడి ఉన్న బయ్యారం ఉక్కు పరిశ్రమపై కేంద్రం మాట మార్చిందని, రాష్ట్ర ప్రభుత్వర ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పూనుకోవాలని కోరారు. గిరిజన యువతకు ఉపాధి మార్గాలను చూపే ట్రైకార్ రుణాలు మంజూరైనా యూనిట్లు అందలేదని ఆవేదన వ్యక్తర చేశారు. ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి, ఇండ్లు లేని పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, మండల కేంద్రాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటు చేయాలని కోరారు.
గిరిజన సంప్రదాయ నృత్యంతో ర్యాలీ
తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా 3వ మహాసభ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీ ఆకట్టుకుంది. కారేపల్లిలోని మండల కార్యాలయాల నుండి గిరిజన సంప్రదాయ నృత్యాలు, డప్పు దరువులతో ర్యాలీ కొనసాగింది. ర్యాలీ ముందు గిరిజన సంఘం నేతలు ప్రజలకు అభివాదం చేస్తూ సభ ప్రాంగనం వరకు కదిలారు. జై సేవాలాల్, జై కొమరం భీం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మహాసభలో గిరిజన సంఘం జిల్లా ఇంచార్జీ బండి రమేష్, రైతు సంఘంరాష్ట్ర సహాయ కార్యదర్షి మూడు శోభన్, మాజీ వైరా ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, సర్పంచ్లు బానోత్ బన్సీలాల్, హలావత్ ఇందిరాజ్యోతి, కుర్సం సత్యనారాయణ, బానోత్ కుమార్, గుగులోత్ పద్మామంగ్యా, బిజ్జా రాము, కల్తి భద్రమ్మ, మొగిలి ఆదినారాయణ, గిరిజన సంఘాల నాయకులు దారావత్ సైదులు, అజ్మీర శోభన్నాయక్, వజ్జా రామారావు, వ్యసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు
కొండెబోయిన నాగేశ్వరరావు, సీఐటీయు కన్వీనర్ కే.నరేంద్ర, పోడు సంఘం నాయకులు పాసిన్ని నాగేశ్వరరావు, కేపీపీఎస్ నాయకులు తలారి దేవప్రకాశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెద్దబోయిన ఉమాశంకర్, అజ్మీర వీరన్న, అడ్డగోడ ఐలయ్య, తోటకూరి రాంబాబు, ఎర్రబెల్లి రఘు, వైఎస్ఆర్టీపీ నాయకులు ధర్మసోత్ రామునాయక్, భూక్యా దేవిలాల్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొండలరావు తదితరులు పాల్గొన్నారు.