Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.25వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
నవతెలంగాణ-మధిర
కమీషన్ ఇస్తేనే చెక్కుల మీద సంతకం పెడతానని మధిర జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత కాంట్రాక్టర్ మునుగోటి వెంకటేశ్వరరావును గత 20 రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. మన బస్తి మనబడి పథకం కింద మధిర గర్ల్స్ హైస్కూల్‌కి ప్రభుత్వం 24 లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులతో సదరు కాంట్రాక్టర్ మునుగోటి వెంకటేశ్వరరావు 90 శాతం పనులు పూర్తి చేశారు. దీనికి గాను హెచ్ఎం మరియు విద్యా కమిటీ పేరు మీద కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన 7 లక్షలా 88 వేలా 446 రూపాయల చెక్కు ఈ నెల మూడో తేదీన పాఠశాలకు వచ్చింది. ఆ చెక్కు ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్ హెచ్ఎం శ్రీలతని 20 రోజులుగా అడుగుతున్నాడు. 24 లక్షల రూపాయలకు రెండు శాతం అంటే 50వేల రూపాయలు కమీషన్ ఇస్తేనే చెక్కు ఇస్తానని హెచ్ఎం శ్రీలత కాంట్రాక్టర్‌ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. దీంతో గత్యంతరం లేక కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఎసిబి అధికారుల సూచన మేరకు శనివారం హెచ్ఎం శ్రీలతకు హైస్కూల్లో కలిసి 50వేలు ఇచ్చేందుకు కాంట్రాక్టర్ ఒప్పుకొని పాతికవేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. దీనిపై ఖమ్మం ఎసిబి డిఎస్పి సూర్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ కాంట్రాక్టర్ వద్ద మధిర బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీలత లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.