Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు సాగుదారులకు అన్యాయం చేస్తే తిరుగుబాటు చేస్తాం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-కొత్త గూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగులో ఉన్న పోడు భూములన్నింటికీ హక్కు పత్రాలు వెంటనే ఇవ్వాలని, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదో ఒక కారణం చూపి హక్కు పత్రాలు ఇవ్వకుండా పోడు సాగు దారులకు అన్యాయం చేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఆదివారం స్థానిక మంచికంటి భవన్లో జిల్లా కమిటీ సమావేశం మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన పాల్గొని ప్రసంగిస్తూ జిల్లాలో పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వడం కోసం సబ్ డివిజనల్ స్థాయి, జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీ సమావేశాలు కలెక్టర్ నిర్వహించారని, ఆ వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 82737 మంది 2,94,890 ఎకరాలకు దరఖాస్తు చేశారని, ముఖ్యమంత్రి హామీ ప్రకారం సమావేశాలలో ప్రతి పోడు సాగు దారుడికి న్యాయం జరిగే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగా పోడు సాగుకు ఎవరూ ప్రోత్సహించరని కానీ ఇప్పటికే సాగులో ఉన్న వారికి హక్కు పత్రాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ ఆధ్వర్యంలో ప్రతిఘటన చేస్తామని అన్నారు. అదే విధంగా జిల్లాలో పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే.రమేష్, కె.పుల్లయ్య, ఎం.జ్యోతి, ఎంబి నర్సారెడ్డి, కె.బ్రహ్మచారి, కారం పుల్లయ్య, లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్, ఎస్ఏ.నబి, దొడ్డ రవికుమార్, కొండబోయిన వెంకటేశ్వర్లు, వీర్ల రమేష్, బి.చిరంజీవి, గడ్డం స్వామి, చిలకమ్మ, ఎం.రేణుక, జి.పద్మ, సరియం కోటేశ్వరరావు, నిమ్మల వెంకన్న, పిట్టల అర్జున్ తదితరులు పాల్గొన్నారు.