Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండర్పాస్ లేకపోతే రైతులకు అవస్థలే...
- ట్రాఫిక్ సమస్య, రోడ్డు ప్రమాదాలకు నెలవు... ఆందోళనలో రైతులు
- ఉన్నతాధికారులు అండర్ పాస్ మంజూరు చేయించాలి
నవతెలంగాణ-ముదిగొండ
సూర్యాపేట జిల్లా కోదాడ నుండి మహబూబాబాద్ జిల్లా కొరివి వరకు జాతీయ రహదారి (బైపాస్) మండల పరిధిలో గోకినేపల్లి, వెంకటాపురం, సువర్ణాపురం, ముదిగొండ గ్రామాలను ఆనుకొని రహదారి వెళుతున్న విషయం విధితమే. ఈ రహదారి పనులను కాంట్రాక్టర్లు శరవేగంగా కొనసాగిస్తూ విస్తరణ చేస్తున్నారు. జాతీయ రహదారి విస్తరణలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రామాల రైతులు, ప్రజలు వ్యవసాయ పనులకు పొలాల్లోకి వెళ్లేందుకు లింకు రహదారులు ఉన్నాయి. ఈ జాతీయ రహదారి నిర్మాణంతో ఈ లింకు రహదారులు మూసుకొని పోతున్నాయి. దీంతో రైతులు, ప్రజలు వ్యవసాయ పనులకు పొలాలకు ఎలా వెళ్లాలని ఆందోళనకు గురవుతున్నారు. ఈ జాతీయ రహదారి వలన ఆరు చోట్ల లింకు రహదారులు మూసుకొని పోతున్నాయి. వల్లభి, గోకినేపల్లి, వెంకటాపురం, ముదిగొండ, చిరుమర్రి, సువర్ణాపురం గ్రామాల ప్రజలు, రైతులు, వాహనదారులు రాకపోకలకు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు అవస్థలు పడాల్సివస్తుంది.
ప్రధానంగా ముదిగొండ వెంకటాపురం, చిరుమర్రి, గోకినేపల్లి గ్రామాల రైతులు వ్యవసాయ పనిముట్లు, పశువులు, గొర్రెలు మేకలను మేతకు పొలాలకు తోలుకొని వెళ్లేందుకు నూతనంగా నిర్మాణం చేసే జాతీయ రహదారి వెంకటాపురం గ్రామ సమీపన ఎన్ఎస్పి బ్రిడ్జి నుండి అండర్పాస్ మంజూరు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు గత రెండు నెలల నుండి ఆందోళన నిర్వహిస్తున్న విషయం కూడా విధితమే. గతంలో ఉన్న పాత లింకు రహదారిని రోడ్డు నిర్మాణంలో మూసి వేయకుండా బ్రిడ్జి నుండి అండర్పాస్ ఏర్పాటు చేయాలని రైతులు, రైతు సంఘం జాతీయ రహదారి కాంట్రాక్టర్ లతోపాటు, అధికారులకు వినతిపత్రాలు అందజేసి లింకు రహదారి ఉన్న ప్రదేశంలో పనులను నిలిపివేశారు. ప్రధానంగా వెంకటాపురం,ముదిగొండ గ్రామాలకు చెందిన వందమంది రైతుల వ్యవసాయ సాగు భూములు 400 ఎకరాలు వెంకటాపురం, చిరుమర్రి వెళ్లే లింకు రహదారి ఆనుకొని ఉన్న ఎన్ఎస్పి కాలువ పరిధిలో సాగు అవుతున్నాయి. లింకు రహదారి లేకపోవటంతో జాతీయ రహదారి నుండి పశువులు, గొర్రెల, మేకల పెంపకందారులు వ్యవసాయ పనిముట్లతో రైతులు,అన్ని వర్గాల ప్రజలు పనులకు వెళ్లాలంటే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి, ఇబ్బందిపడి రోడ్డు ప్రమాదాలకు గురై అవకాశంఉంది. వాహనాల రద్దీ పెరిగి, ట్రాఫిక్ సమస్యతో రోడ్డు దాటాలంటే వాహనాల శబ్దాలకు పశువులు బెదిరి, అదిరిపోయి, తరచుగా రోడ్డు ప్రమాదాలు జరగటానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. లింకు రహదారి ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, ఇరిగేషన్ శాఖ అధికారులు, మండల తాసిల్దార్ శిరీష కు రైతులు, రైతుసంఘం వినతిపత్రాలు అందజేసి అండర్పాస్ మంజూరు చేసి రైతుల సమస్యను పరిష్కరించాలని కోరారు. సువర్ణాపురం, ముదిగొండ వెళ్లే బీటి రహదారిలో అండర్పాస్ మంజూరు చేయాలని రెండు గ్రామాల ప్రజలు వాహనదారులు పేర్కొన్నారు. కాగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఇటీవలకాలంలో సువర్ణాపురం నుండి ముదిగొండ వెళ్లే బిటి రహదారిని క్షేత్రస్థాయిలో సందర్శించి, పరిశీలించి అండర్పాస్ మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వెంకటాపురం గ్రామ సమీపాన రైతులు పొలాలకు వెళ్లేందుకు లింకు రహదారి ప్రదేశంలో బ్రిడ్జి అండర్పాస్ కు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి వచ్చేంత వరకు కాంట్రాక్టర్లు పనులు నిలిపివేస్తామని తాసిల్దార్ శిరీష సమక్షంలో లిఖితపూర్వకంగా రాసి రైతులకు హామీ ఇచ్చారు. ఎన్నో ఏండ్లగా కష్టనష్టాలను అనుభవిస్తూ వ్యవసాయం సాగు చేస్తూ నిత్యం వ్యవసాయం పొలాల్లోకి వెళుతున్నా రహదారి కళ్ళముందే జాతీయ రహదారిలో మూసుకుపోతుందంటే రైతులు తట్టుకోలేకపోతున్నారు. ఆందోళన, అక్రందన, ఆవేదనల మధ్య రైతులు నలిగిపోతు లింకు రహదారి అనుమతి కోసం చమటోడ్చిన కళ్ళతో ఎదురుచూస్తున్నారు.