Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
హార్వెస్ట్ విద్యాసంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్ప్రింగ్ లీఫ్ పాఠశాలను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. తల్లిదండ్రుల తరువాత సమాజంలో అందరికంటే గౌరవించబడే వారు ఉపాధ్యాయులని గుర్తుచేశారు. భావిభారత పౌరులైన విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దాలని సూచించారు. రూరల్ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. పాఠశాలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. తనకు పదో తరగతి వరకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఇప్పటికీ గుర్తున్నారని వివరించారు.విద్యార్థులు మంచిగా చదువుకొని జీవితంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అన్నిదానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని సాధ్యమయినంత వరకు ఎక్కువ మందికి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే వారికి ఇచ్చే గొప్ప సంపద అని గుర్తుచేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ మాట్లాడుతూ.. హార్వెస్ట్ యాజమాన్యం వారు విద్యాప్రణాళికలో పలు మార్పులు తీసుకొచ్చి ఒత్తిడిలేని విద్య, సాంకేతిక నిపుణత, స్వయం ఆలోచనా విధానంతో విద్యార్థులను తయారు చేస్తారని భవిష్యత్తులో అది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. స్ప్రింగ్ లిఫ్ పాఠశాల కూడా రానున్న రోజుల్లో జిల్లాలో విద్యారంగంలో అగ్రభాగంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధు, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కరస్పాండెంట్ పి.రవి మారుథ్, ప్రిన్సిపాల్ పార్వతీ రెడ్డి, ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యండపల్లి వర ప్రసాద్, సూడా డైరెక్టర్ గూడ సంజీవ రెడ్డి,పాఠశాల సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.