Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- సత్తుపల్లిలో రూ. 100కోట్ల అభివృద్ధి
- ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు
- సత్తుపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లిలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని కొందరు రాజకీయ నాయకులు చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని, విజ్ఞులైన ప్రజలు చూస్తూ కోరుని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం సత్తుపల్లిలో ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావుతో కలిసి సండ్ర పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సండ్ర మాట్లాడారు. సత్తుపల్లిలో గతంలో జరిగిన అభివృద్ధి, ఇప్పుడున్న అభివృద్ధిని మేథావులైన విశ్రాంత ఉద్యోగులు, మీడియా మిత్రులు విశ్లేషణలు చేయగలరని, రాజకీయ లబ్ధిపొందేందుకు దిగజారుడు విమర్శలకు దిగితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఊరుకునే పరిస్థితి లేదన్నారు. సత్తుపల్లి అభివృద్ధి వారి కండ్లకు కనపడటం లేదా అని ప్రశ్నించారు. గతంలో మున్సిపల్ సమావేశాలు జరిగిన సందర్భాల్లో ఆందోళనలు జరిగేవన్నారు. ఇప్పుడా పరిస్థితి ఎక్కడా కనపడటం లేదన్నారు. తెలంగాణలో పెద్దఎత్తున ఓ విజన్‌తో కేసీఆర్ నాయకత్వంలో యువమంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రానున్న 3 నెలల కాలంలో సత్తుపల్లిలో సీసీరోడ్లు లేని వీధులుండవన్నారు. వేశ్యకాంతల చెరువు, తామర చెరువులను టూరిజం స్పాట్స్‌గా తీర్చి దిద్దనున్నామన్నారు. ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయం నుంచి ఇచ్చిన అభివృద్ధి నివేదికను పరిశీలిస్తే సుమారు రూ. 100కోట్ల అభివృద్ధి పనులు ఉన్నాయన్నారు. అభివృద్ధి ఇంత పెద్దఎత్తున జరిగినా విమర్శలు చేస్తున్నారంటే వాళ్లకు కండ్లు కనపడటం లేదని అర్థమవుతుందని, తక్షణమే వారంతా కంటి డాక్టర్‌ను చూపించుకోవాలని సూచించారు. 15వ వార్డు కౌన్సిలర్ వీరపనేని రాధికాబాబీ ఎమ్మెల్యే సండ్రను కమ్యూనిటీ హాలు మంజూరు చేయమని కోరగా, ఎంపీ నామాను ఆర్వో ప్లాంటును ఇమ్మని కోరగా ఇందుకు ఎమ్మెల్యే, ఎంపీ స్పందించారు. కమ్యూనిటీ హాలును మంజూరు చేస్తామని సభలో ప్రకటించారు. అవకాశం ఉంటే ఎంపీ ల్యాడ్స్ నుంచి గాని, లేకుంటే తన తండ్రి పేరున ఉన్న నామ ముత్తయ్య ట్రస్ట్ నుంచి ఆర్వో ప్లాంట్‌ను ఇవ్వడం జరుగుతుందని ఎంపీ నామ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ కోడూరు సుజాత, కౌన్సిలర్లు వీరపనేని రాధికాబాబీ, మట్టా ప్రసాద్, ఎస్కే చాంద్‌పాషా, అద్దంకి అనిల్‌కుమార్, మేకల భవానినరసింహారావు, నాయకులు దొడ్డా శంకరరావు, ఎస్కే రఫీ, వీరపనేని బాబీ, వల్లభనేని పవన్, అమరవరపు విజయనిర్మలకృష్ణారావు, వేములపల్లి మధు, నరుకుళ్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.