Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గడల శ్రీనివాస్ ఆస్తులపై విచారణ జరిపించాలి
- అక్రమ సొమ్ముతో రాజకీయాల్లోకి
- విలేకరుల సమావేశంలో కామేష్
నవతెలంగాణ-పాల్వంచ
హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ప్రజాసేవకు ప్రభుత్వ ఉద్యోగం అడ్డంకిగా మారిందా అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ నిలదీశారు. సోమవారం పాల్వంచ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర హెల్త్ డైరక్టర్ హౌదాలో ఉన్న వ్యక్తి కరోనా పేరుతో రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రులతో కుమ్మక్కై వందల, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఆవిధంగా అడ్డదారిలో వచ్చిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అర్దం కాక రాజకీయాల్లో చేరి మరింత ధనాన్ని పోగు చేసుకునేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన పదవీ బాధ్యతలు వెలగబెడుతున్న తరుణంలో మెడికల్ మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోయి ప్రజలను నిలువునా దోచుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. కోవిడ్ మహమ్మరిని కట్టడి చేయాల్సిన వ్యక్తి వైరస్ పేరుతో ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేసి వారిని ఆసుపత్రులు, మెడికల్ షాపులో ఔషధాలు కోనుగోలు చేసేలా ప్రేరేపించి కార్పొరేట్ సంస్థల నుంచి పెద్ద సంఖ్యలో కమీషన్లు గుంజారని మండిపడ్డారు. శవాలపై బొంగు పేలాలు ఏరుకున్న చందాన అప్పనంగా వచ్చిన సొమ్ముతో ఇక్కడ హెల్త్ క్యాంపు, ఉచిత వైద్య శిబిరాలు, ఉద్యోగ నియామకాలు అంటూ స్థానికులను బుట్టలో పడేసి రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు గుర్తుకు రాని కొత్తగూడెం ప్రజలపై ఒక్కసారిగా ప్రేమ పుట్టుకు రావటం వెనుక మర్మం ఏంటో అందరికీ అర్థం అవుతుందని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇన్ని డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. గడల ఎన్ని డ్రామాలు ఆడినా కొత్తగూడెం ప్రజలు వలసవాదిగా చూస్తారే తప్ప ఎన్నికల్లో ఆదరిస్తారనే భ్రమలు వీడాలని హితవు పలికారు. ఇప్పటికైనా చేస్తున్న ఉన్నత ఉద్యోగం పై దృష్టి సారించి రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కాపాడాలని స్పష్టం చేశారు.
ఒకవేళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకుంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల క్రితం కేటీపీఎస్ యాజమాన్యం సుమారు రూ.8లక్షల ఖర్చు చేసి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఇప్పటికే ఒకసారి ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకుని ఆ పదవికి కళంకం తీసుకు వచ్చి రాష్ట్ర ప్రజల దృష్టిలో అభాసు పాలయ్యారని విమర్శించారు. ఇకనైనా డ్రామాలు ఆపాలని తేల్చి చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మహిళా కన్వీనర్ కోలా మల్లికా, జెట్టి ఆనందరావు, కేతిని కుమారి, ఏడెల్లి మర్థమ్మ, రమణ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.