Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాడీ బిల్డింగ్ పోటీల్లో బండారు లోక్ నాధుకు బంగారు పతకం
- గతంలో మిస్టర్ తెలంగాణగా ఎంపిక
- పలువురు అభినందనలు
నవతెలంగాణ-భద్రాచలం టౌన్
దివ్య క్షేత్రం భద్రాచలంకు చెందిన యువ కెరటాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో తమ సత్తా చాటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాన్ని పతాకాస్థాయిలో నిలుపుతున్నారు. మొన్న క్రికెట్లో త్రిష, నేడు బాడీ బిల్డర్ యువ కెరటం బండారు లోక్ నాథ్. గతంలోనే తన సత్తా చాటి మిస్టర్ తెలంగాణగా ఎంపికైన ఈ యువ భద్రాద్రి బాహుబలి హైదరాబాదులో శనివారం ముగిసిన స్టీల్ మ్యాన్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ పోటీలో ప్రథమ స్థానం నిలిచి బంగారు పథకాన్ని సాధించి భద్రాచలంకు వన్నెతెచ్చాడు. ఇదివరకే మిస్టర్ ఇండియా పోటీలకు కూడా ఈ యువకుడు సెలక్ట్ కావడం గమనార్హం. భద్రాచలం పట్టణంలోని వైయస్సార్ కాలనీలో ఎస్ఎస్ కోచింగ్ క్యాంప్ నిర్వాహకులు బండారు మావో కుమార్ తనయుడే బండారు లోకనాథ్. ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు భద్రాచలం పట్టణంలోని సెయింట్ ఫాల్స్ స్కూల్లో ఇతడు ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. పదవ తరగతి వరకు రూప స్కూల్లో విద్యను అభ్యసించాడు. అనంతరం భద్రాచలంలోనే డిగ్రీ చదువు పూర్తి చేశాడు. చిన్నప్పటినుంచి బాడీ బిల్డర్‌గా రాణించాలనే తలపుతో కఠినమైన ప్రాక్టీస్ చేసి, ఆ దిశగా అడుగులు వేశాడు. హైదరాబాదులో జరిగిన స్టీల్ మాన్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఐదు రాష్ట్రాల నుంచి దాదాపు 300 మందికి పైగా పాల్గొన్న ఈ కాంపిటీషన్లో భద్రాచలంకు చెందిన బండారు లోక్ నాధ్‌ను బంగారు పతకం వరించటం గమనార్హం. భద్రాచలం దివ్య క్షేత్రంకు ఇంత ఘనకీర్తి తీసుకొచ్చిన ఈ 24 ఏళ్ల భద్రాచలం బాహుబలి బండారు లోకనాధుని భద్రాచలంలోని ప్రముఖులు అభినందిస్తున్నారు.