Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నియోజక వర్గ కన్వీనర్ మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
మెడికో డాక్టర్ ప్రీతి సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు ప్రయత్నించి నిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ మృతి చెందడం అత్యంత బాధాకరమని ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి పర్యవేక్షణ కమిటీలు, కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడారు. ప్రీతి మృతిపట్ల సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఇటీవలికాలంలో ర్యాగింగ్, సీనియర్ల వేధింపులు, పని ఒత్తిడి తధితర కారణాల వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. 2022లో రాష్ట్రంలో 32 ర్యాగింగ్ కేసులు యూసీజీకి వచ్చినట్లు స్వయంగా కేంద్ర మానవ వనరుల శాఖనే పేర్కొన్నదంటే ర్యాగింగ్ ఎంత ప్రమాదకరంగా ఉన్నదో అర్థమవుతుందన్నారు. సురక్షితమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నదని అన్నారు.