Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా ధ్యేయం
- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా ధ్యేయమని, ప్రజల చిరకాలం ఆకాంక్షలు నేరవేర్చేందుకు కృషి చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర పనిచేస్తానని తెలిపారు. కొత్తగూడెం ప్రజల చిరకాల వాంఛలు ఎన్నో ఉన్నాయని వాటిలో కొన్ని నెరవేర్చానని, మరికొని నెరవేర్చేందుకు నిరంతరం పనిచేస్తానని చెప్పారు. ఎవరెన్ని విమర్శలు చేసినా బెదిలేది లేదన్నారు. చివరి రక్తం బొట్టు వరకు ప్రజాసేవలోనే, ప్రజాక్షేత్రంలోనే ఉంటానన్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదని, అధికారం ఉన్నప్పుడు ప్రజలతో, అధికారంలో లేనప్పుడు ప్రజలకు దూరంగా పారిపోయేవాడిని కాదని చెప్పారు. నిత్యం ప్రజా సేవలోనే ఉన్నానని చెప్పారు. ప్రజల మద్దతు ఉండబట్టి 20 సంవత్సరాలు ప్రజా ప్రతినిధిగా ప్రజల మధ్య ఉన్నానన్నారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డానని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి నియోజకవర్గంలో రూ.20 వేల కోట్లతో అనేక అభివృద్ధి చేశానని తెలిపారు. ఈనాడు రూ.3,000 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను జంట నగరాలుగా అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా 25 కిలోమీటర్ల పరిధిలో నియోజకవర్గ వ్యాప్తంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి విద్యుత్ వెలుగులు నింపిన ఘనత మనదే అన్నారు. కొత్తగూడెం పట్టణ ప్రజల చిరకాల వాంఛ ఆయన క్రమబద్దీకరణ పట్టాలను పంపిణీ చేసి వారి రుణం తీర్చుకున్నానని మరికొంత మందికి త్వరలో పట్టాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే కొత్తగూడెం నియోజకవర్గంలోని పేదలకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని చెప్పారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే పోడు భూముల పంపిణీలో నిమగమయ్యారని తెలిపారు. సొంత స్థలం ఉన్న పేదలకు రూ.3 లక్షలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
ఈ విలేకరుల సమావేశంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ లక్ష్మీదేవి పల్లి ఎంపీపీ సోనా, సుజాతనగర్ ఎంపీపీ భుక్యా విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.