Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల జిల్లా సదస్సులో పోతినేని
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామ గ్రామాన ప్రచార కార్యక్రమాన్ని మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించాలని సీఐటీయూ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, అఖిల భారత రైతు సంఘం జిల్లా కమిటీలు నిర్ణయించాయి. మూడు సంఘాల జిల్లా సదస్సు టీచర్స్ భవన్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.పద్మ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎలమంచి వంశీ అధ్యక్షతన జరిగింది. సదస్సులో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతునేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాల ఫలితంగా దేశం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. రైతుల పంటల గిట్టుబాటు ధరల చట్టం చేయాలి, గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాలి, కార్మిక వ్యతిరేక లేబర్ కోడులు రద్దు చేయాలి, కార్మికులకు వేతనాలు పెంచాలి, నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలి, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ తదితర డిమాండ్లపై గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పిలుపు నిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు వెన్నెముకగా ఉన్నారని ఈ వర్గాల ప్రజలను కేంద్ర ప్రభుత్వం తన నిరంకుశ విధానాల ద్వారా దోపిడీ చేస్తుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజానికంపైన ఆర్థిక భారాలు వేస్తూ అంబానీ, అధానీలకు లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపదను దోచిపెడుతుందని విమర్శించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాసంఘాలు దేశభక్తియుతమైన పోరాటాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని లక్షలాది మంది రైతులు కార్మికులు, వ్యవసాయ కార్మికులు పార్లమెంటు ముందు మహాధర్నా నిర్వహిస్తారని తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం మీద ప్రజాస్వామిక హక్కుల మీద చేస్తున్న దాడిని ప్రతిఘటిస్తామని చెప్పారు. ఈ సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మచారి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, మూడు సంఘాల నాయకులు డి.వీరన్న, బత్తుల, వెంకటేశ్వర్లు, కున్సోత్ దర్మా, యన్.నాగరాజు, వినోద, దొడ్డా లక్ష్మినారయణ, నిమ్మల వెంకన్న, నభి, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.