Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభ్యుల ఏకగ్రీవ ఆమోదం
- విలీన గ్రామాల అభివృద్ధికి రూ.586.55 లక్షలు
- బడ్జెట్ మిగులు రూ.292.14 లక్షలు
- బడ్జెట్ భేష్ : ఎమ్మెల్సీ తాతా మధు
- భువన యాప్ ద్వారా అంచనా: కలెక్టర్ గౌతమ్
- నగర సమగ్రాభివృద్ధికి బడ్జెట్ దోహదం: మేయర్ నీరజ
నవతెలంగాణ - ఖమ్మంప్రాంతీయప్రతినిధి/ కార్పొరేషన్
ఖమ్మం నగర పాలకసంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 221.72 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను సభ్యులు ఆమోదించారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నగర మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం మంగళవారం నిర్వహించారు. కార్పొరేషన్ అకౌంట్ అధికారి శివలింగం బడ్జెట్ పద్దును చదువగా, సభ్యులు ఏకగ్రీవంగా అమోదించారు. కార్పొరేషన్ బడ్జెట్లో సొంత ఆదాయం రూ. 8056.10 లక్షలుగా చూపారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల పన్నుల ద్వారా రూ. 3078.00 లక్షలు, కిరాయిల ద్వారా రూ. 472.10 లక్షలు, భవన నిర్మాణ అనుమతులు, ఎల్ఆర్ఎస్, ఇతర టౌన్ ప్లానింగ్ సేవల ద్వారా రూ. 2942.00 లక్షలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ఇతర శానిటేషన్ సేవల ద్వారా రూ. 260 లక్షలు, తాగునీటి పన్నులు, ఇతర ఇంజినీరింగ్ సేవల ద్వారా రూ. 1193.00 లక్షలు సొంత ఆదాయంగా వస్తాయని బడ్జెట్లో చూపారు. వేతనాలు, పీఎఫ్, ఈపీఎఫ్, కార్యాలయ నిర్వహణ, గ్రీన్ బడ్జెట్, విద్యుత్ చార్జీల రూపేణా రూ. 8056.10 లక్షలు ఖర్చవుతాయని అంచనా వేశారు. నాన్‌ప్లాన్ గ్రాంట్ల కింద 15వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి, అమత్ పథకం, లే అవుట్ క్రమబద్దీకరణ, ప్రత్యేక అభివృద్ధి నిధులు, ముఖ్యమంత్రి వాగ్దాన నిధులు ద్వారా రూ.13382.00 లక్షలు, ప్లాన్ గ్రాంట్లలో ఎస్ఎఫ్ సి, కార్పొరేషన్ అభివృద్ధి, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ ద్వారా రూ. 80 లక్షలు వస్తాయని అంచనాలు వేశారు. నియోజవర్గ అభివృద్ధి, స్పెషల్ డెవలప్మెంట్, ఎంపీ ల్యాడ్స్ నిధులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా రూ. 92.00 లక్షలు వస్తాయని వివరించారు. మొత్తం బడ్జెట్లో జీతాలు, విద్యుత్ బిల్లులు, పాలన నిర్వహణ ఖర్చులు పోయిన తర్వాత మిగిలిన బడ్జెట్ లో 1/3 శాతం విలీన గ్రామాల అభివద్ధికి రూ.586.55 లక్షలు కేటాయించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలకు రూ. 2801.34 లక్షలు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్య నిర్వహణకు రూ. 821.00 లక్షలు, విద్యుత్ చార్జీల కోసం రూ. 641.00 లక్షలు, రుణాల చెల్లింపుకు రూ. 126.00 లక్షలు, గ్రీన్ బడ్జెట్ కోసం రూ. 805.61 లక్షలు, వివిధ డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాల కోసం బడ్జెట్ కింద రూ. 1173.00 లక్షలు, ఇంజనీరింగ్ విభాగ వ్యయం రూ. 491.00 లక్షలు, సాధారణ పరిపాలన వ్యయం రూ.502.50 లక్షలు, పట్టణ ప్రణాళిక విభాగ వ్యయం 108.00 లక్షలు, ప్రజా సౌకర్యాలకు రూ.30.00 లక్షలుగా చూపించారు. సొంత ఆదాయంలో ఖర్చులు పోను మిగిలిన రూ. 292.14 లక్షలు మిగులు బడ్జెట్‌గా చూపారు. వీటితో డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
సవివరంగా బడ్జెట్: ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
గతంలో ఎన్నడూ లేని విధంగా సవివరంగా బడ్జెట్ రూపకల్పన చేశారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కితాబు ఇచ్చారు. గతంలో ఆదాయం, భవిష్యత్తు ఆదాయం బడ్జెట్ లో వివరించారన్నారు. 2014 సంవత్సరం తర్వాత, కార్పొరేషన్ గా అవతరించిన తర్వాత ఖమ్మం అభివద్ధిలో రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఒకప్పుడు మురికికూపంగా ఉన్న 3వ పట్టణ ప్రాంతం, ఇప్పుడు గోళ్లపాడు ఆధునికీకరణ పనులతో సుందరంగా తయారైందన్నారు. అభివృద్ధి, సౌకర్యాల కల్పనతో ప్రాంత విలువ పెరిగిందన్నారు. ఆదాయ వనరుల పెంపుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, వచ్చే ఆర్థిక సంవత్సరం రాబడి, ఖర్చులపై బడ్జెట్ వివరంగా ఉన్నట్లు తెలిపారు. రీ అసైన్మంట్ చేయని ఆస్తులను భువన యాప్ ద్వారా అంచనా వేయాలని అన్నారు. ట్రేడ్ లైసెన్సుల విషయంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. లే అవుట్ అనుమతులతో ఆదాయం పెరిగిందన్నారు. రహదారుల ఆక్రమిస్తున్న వీధి వ్యాపారులను స్ట్రీట్ వెండర్ జోన్లకు తరలించాలన్నారు. జీవో 58, 59లపై కార్పొరేటర్లు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ నగర సమగ్రాభివృద్ధికి బడ్జెట్ దోహదపడుతుందన్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతో నిరంతరం నగరాభివృద్ది కోసం శ్రమిస్తున్నామన్నారు. అన్ని డివిజన్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. వాస్తవిక ఆదాయాలు, రాబడులను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ అంచనాలు రూపొందించినట్లు మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బడ్జెట్‌కు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్ అమలుకు సహకరించాలని కమిషనర్ కోరారు. బడ్జెట్ సమావేశంలో నగర కార్పొరేటర్లు, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.