Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-చంద్రుగొండ
విద్యార్థులంతా సివి రామన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు విద్యార్థులకు సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రుగొండలో కాంప్లెక్స్ స్థాయి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతరత్న సర్ చంద్రశేఖర వెంకట రామన్ (సివి రామన్) రామన్ ఎఫెక్ట్‌ను 1928 ఫిబ్రవరి 28న కనుగొన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్సు దినోత్సవాన్ని జరుపుకుంటారు. మండల విద్యాశాఖ అధికారి సత్తెనపల్లి సత్యనారాయణ, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఉండేటి ఆనంద కుమార్ రిబ్బన్ కట్ చేసి కాంప్లెక్స్ స్తాయి సైన్స్ మేళాను ప్రారంభించారు. ఈ సైన్సు మేళాలో చంద్రుగొండ కాంప్లెక్స్‌లో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక పాఠశాలల, ప్రాథమికోన్నత పాఠశాలల, ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు ప్రతి పాఠశాల నుండి ప్రాథమిక స్థాయి, ప్రాథమికోన్నత స్థాయి, ఉన్నత పాఠశాల స్థాయి నుండి రెండు సైన్సు ప్రాజెక్టులను ఈ మేళాకు అనుమతించారు. ఈ ఎగ్జిబిట్స్ నుండి ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి శాస్త్రవేత్త మాట్లాడుతూ నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించే విధంగా ఈ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాలకు చెందిన సైన్స్ ఉపాధ్యాయులు రాజశ్రీ, ఎండి వాజిద్, ఉమారాణి, కృష్ణ, స్వరూప రాణి, స్కూల్ కాంప్లెక్స్ నుండి కాంప్లెక్స్ సెక్రటరీ శ్రీరాములు, కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ సేవ్యా, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.