Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ శ్రీరామమూర్తి
నవతెలంగాణ-అశ్వారావుపేట
విద్యార్ధులు ఎవరైనా కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి అన్నారు. గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎ.సాగర్ అధ్యక్షతన నిర్వహించిన కళాశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో విద్యకు అత్యధిక నిధులు కేటాయిస్తుందని అన్నారు. అశ్వారావుపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నారని, తప్పకుండా అతి త్వరలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయిస్తారని తెలిపారు. అదే విధంగా కళాశాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెల్లి పరిష్కరిస్తామని తెలిపారు. కళాశాలలో మరమ్మత్తులకు గురైన ఆర్ఓ వాటర్ ప్లాంట్ పునరుద్దరణకు రూ.5 వేలు నగదును ప్రిన్సిపాల్ సాగర్‌కు అందజేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులును కళాశాల సిబ్బంది శాలువాలతో సన్మానించారు. స్థానిక భూస్వామి దామెర కుమార మహిపాల్ (కన్న నాయన) కళాశాలకు విరాళంగా డిపాజిట్‌గా అందజేసిన రూ.2 లక్షల నగదుతో వచ్చే వడ్డీతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు ప్రోత్సాహక పారితోషికాన్ని 9 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15 వందల చొప్పున నగదును అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు మందపాటి రాజమోహన్ రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు, అశ్వారావుపేట పాలక వర్గం సభ్యులు యం.ఎస్ ప్రకాష్ రావు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ శీమకుర్తి సుబ్బారావు, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహరావు, పత్తేపరపు రాంబాబు, కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.