Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
వ్యవసాయంలో యాంత్రిక సాగుతో అధిక దిగుబడులు రాబట్టవచ్చని స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాలలోని సేద్య విభాగ బోధనా సిబ్బంది చే ఐకార్ (ఐసీఏఆర్)లో గిరిజన ఉప ప్రణాళిక 2022-23 ఆర్ధిక సంవత్సరంలో సమగ్ర వ్యవసాయ వ్యవస్థల పై ఒక్క రోజు శిక్షణా నేపద్యంలో మండల పరిధిలోని మల్లాయిగూడెంలో గురువారం గిరిజన రైతులకు శిక్షణా శిభిరం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ఎరలు పెంచే బెడ్స్, స్ప్రేయర్లు, వ్యవసాయ దిక్సూచి పుస్తకాలు, వానపాముల ఎరువులు , జీవన ఎరువుల ప్యాకెట్లు అందచేశారు. అనంతరం సేద్య విభాగ సహ ఆచార్యులు డాక్టర్ నాగాంజలి రైతులకు ఆ గ్రామంలోని వ్యవసాయ పంటల యాజమాన్యం, వ్యవసాయ ఆధారిత రంగాలు, ముఖ్యంగా పాడి పశువులు, పెరటి కోళ్ల పెంపకం, జీవాల పెంపకం మొదలగు వాటి వల్ల లాభాలు గురించి తెలిపారు. మృత్తిక శాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ సంప్రదాయ వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగాలకు శాస్త్రీయ సాంకేతికను జోడించి వానపాముల ఎరువు తయారీ, పుట్టగొడుగుల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, తేనెటీగల పెంపకాన్ని ఆచరించాలని అభిప్రాయ పడ్డారు. కీటక శాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ టి.పావని మాట్లాడుతూ తేనెటీగలు లేకపోతే నాలుగు సంవత్సరాలలో మానవ మనుగడ అంతరిస్తుందని తెలిపారు. గ్రామ సమన్వయ సమితి సభ్యులు దారా ప్రసాద్ మాట్లాడుతూ గిరిజన రైతులందరూ వాళ్ళు వదిలిపెట్టిన చిరుధాన్యాల సాగును తిరిగి మళ్ళీ మొదలు పెట్టాలి అని కోరారు. చిరుధాన్యాల సాగుతో మంచి ఆదాయమే కాక ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుందని అభిప్రాయపడ్డార. ఆయిల్ పామ్ సేద్య మెళకువల గురించి డాక్టర్ ఐ.వి శ్రీనివాస రెడ్డి, జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి డాక్టర్ రెడ్డిప్రియ వివరించారు.సేద్య విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ కాడా సిద్దప్ప రైతు సోదరులకు వీటితో పాటు పాడి పశువులకు ఉచితంగా నులి పురుగు మందులు కూడా ఇచ్చారు. కార్యక్రమంలో వెటర్నరి అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ స్వప్న పశు పోషణలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు, మెళుకువలు గురించి వివరించారు. అనంతరం మేకల, గొర్రెల పెంపకంలో రైతుల సమస్యలను నివృత్తి చేసారు. ఈ శిభిరాన్ని స్రవంతి, డాక్టర్ కె.నాగాంజలి, డాక్టర్ కాడా సిద్ధప్ప,డాక్టర్ శిరీష సమన్వయ పరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నారం రాజశేఖర్, కళాశాల సీనియర్ బోధనా సిబ్బంది డాక్టర్ వి.వెంకన్న, డాక్టర్ కె. గోపాల కృష్ణ మూర్తి, ఉప సర్పంచ్ బుచ్చయ్య, వార్డ్ సభ్యులు శ్రీ రాం బాబు, చంద్రశేఖర్, వ్యవసాయ విస్తర్ణాధికారి షకీరా భాను, సెక్రటరీ రోహిత్, వ్యవసాయ కళాశాల నాలుగవ సంవత్సర విద్యార్థులు, ఇతర బోధనా, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.