Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తునికాకు బోనస్‌ను చెల్లించాలి
- మాజీ ఎంపీ మిడియం బాబురావు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం నియోజకవర్గంలో వేసవి పంట అయినటువంటి తునికాకు సేకరణ ప్రూనింగ్ పనులను వెంటనే చేపట్టాలని, తునికాకు బోనస్ వెంటనే చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ పట్టణ కమిటీ సమావేశం ఎంబీ నర్సారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గంలో గిరిజన పేదలుకు వేసవిపంటగా ఆర్థికంగా ఉపయోగపడుతున్న తునికాకు సేకరణకు సంబంధించిన మండకొట్టుడు ప్రూనింగ్ పనులను వెంటనే చేపట్టాలని ఆయన కోరారు. భద్రాచలం నియోజకవర్గంలో 2017 నుండి చెల్లించవలసిన తునికాకు పెండింగ్ బోనస్‌ను ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ప్రకటించిందని, వెంటనే బోనస్ చెక్కులను నేరుగా తునికాకు కార్మికులకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను ఎండకడుతూ కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచార క్యాంపెయిన్ నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు బండారు శరత్ బాబు, సున్నం గంగా, వై.వెంకట రామారావు, పి.సంతోష్ కుమార్, నాదెళ్ల లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు ఎన్.నాగరాజు, డి.సీతాలక్ష్మి, బి.కుసుమ, యు.జ్యోతి, జీవనజ్యోతి, సిహెచ్ మాధవరావు, ఎస్.డి ఫిరోజ్ ఖాన్, కోరాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.