Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాటరీ ద్వారా 700 మంది డబుల్ ఇండ్ల లబ్దిదారులు ఎంపిక
- పేదలందరికీ ఇండ్లు ఇవ్వడమే లక్ష్యం : ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నాయని, కొత్తగూడెంలో నిర్మించిన 700 డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసి వారికి అందజేస్తామని, పేదలందరికీ ఇండ్లు ఇవ్వడమే లక్ష్యం కృషి చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం కొత్తగూడెం క్లబ్లో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల నుండి సుమారు 700 మంది డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులను లాటరీ తీసి, లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమల్లో వెనుకబడి ఉందని విమర్శించారు. నా తుది శ్వాస వరకు పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. కొత్తగూడెం తహసీల్దార్‌కు సుమారు 5686 మంది దరఖాస్తులు చేసుకున్నారని, అందులో1475 మందిని ప్రాధిమికంగా ఎంపిక చేశామని, వార్డుకు 19 మంది చొప్పున డ్రా పద్దతిలో ఎంపిక చేసి, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేస్తామని చెప్పారు. పట్టణంలో 376 జీవో, 76 జీవో ద్వారా ఇండ్ల క్రమబద్దీ కరణ పట్టాల పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, కొత్తగూడెం ఎమ్మార్వో రామకృష్ణ, కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్, 36 వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.