Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీలకు గ్రాడ్యుటి చెల్లించాలి
- పని భారం తగ్గించాలి
- ఎన్‌హెచ్‌టిఎస్ యాప్‌ని రద్దు చేయాలి
- ఖమ్మం ధర్నాచౌక్‌లో అంగన్వాడీల ఆందోళన
నవతెలంగాణ-ఖమ్మం
అంగన్వాడీల పోరాటం ఫలితంగా 2022 మే నెలలో 1972 చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు గ్రాట్యుటీ చెల్లించాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి 9 నెలలు గడుస్తున్నా నేటికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించడం లేదని వెంటనే చెల్లించాలని ఎన్‌హెచ్‌టిఎస్ యాప్ రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడి వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని మూడు రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా రెండో రోజు ఖమ్మం ధర్నా చౌక్‌లో ధర్నాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి డబ్బులు చెల్లించకుండా అంగన్వాడీ ఉద్యోగులతో అధికారులు బలవంతంగా రాజీనామా
చేయిస్తున్నారని, వయస్సు పైబడ్డ అంగన్వాడీ ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా నడిరోడ్డుపాలు చేస్తున్నారన్నారు. ఆన్లైన్ పని పేరుతో అనేక యాప్‌లను తీసుకువచ్చి అంగన్వాడీ ఉద్యోగులకు పని భారాన్ని విపరీతంగా పెంచుతున్నారని పేర్కొన్నారు. 2017 నుండి టిఎడిఎలు, ఇంక్రిమెంట్, ఇన్‌ఛార్జి అలవెన్స్‌లు, 2018 నుండి కేంద్ర పెంచిన వేతనాలు నేటికీ ప్రభుత్వం చెల్లించడం లేదని, 2015 నుండి ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు పెంచలేదని, పెరిగిన ధరలకనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచకపోవడం వల్ల అంగన్వాడీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మినీ వర్కర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా గుర్తించడానికి ప్రభుత్వం అనేక షరతులు పెట్టిందని , దీనివల్ల కొంతమంది మినీ వర్కర్లు నష్టపోయే ప్రమాదం ఉందని, సంవత్సరాల తరబడి ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అనేకమంది పని భారం పెరిగి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఐసిడిఎస్‌కు అత్యంత ప్రమాదకరమైన నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రాష్ట్రంలో అత్యంత వేగవంతంగా అమలు చేయాలని చూశారని, సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటాల ఫలితంగా తాత్కాలికంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని నిలుపుదల చేశారని వారు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీకాంత్, పెరుమలపల్లి మోహన్‌రావు, శీలం నరసింహారావు, తిరుమలచారి అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.కోటేశ్వరి, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.రమ్య, కే.సుధారాధ, అంగన్వాడీ యూనియన్ నాయకులు పాపారాణి, పద్మ, స్వరాజ్యం, జి.రమా, జల్లేపల్లి పద్మ, విజయలక్ష్మి, రత్నకుమారి, మాధవి, కృష్ణకుమారి పాల్గొన్నారు.