Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మన్ పదవీకాలం ముగిసి నాలుగు నెలలు
- చైర్మన్ రేసులో 'బంధం' వర్సెస్ 'ఇటికాల'
- 'బంధం'పై వ్యతిరేకత 'ఇటికాల' పై సానుకూలత
- కమల్రాజుకు తలనొప్పిగా మారిన 'చైర్మన్' గిరి
నవతెలంగాణ - బోనకల్
మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం నియామకం బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుకు తలనొప్పిగా మారినట్లు ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల విధానం ప్రకటించిన తర్వాత మొట్టమొదటగా మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా చిత్తారు నాగేశ్వరరావు 19 అక్టోబర్ 20న అధికార బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత రెండుసార్లు ఆరు నెలల పాటు పొడిగించడంతో గత ఏడాది అక్టోబర్ 19తో చిత్తారు నాగేశ్వరరావు పదవి కాలం ముగిసింది. చిత్తారు నాగేశ్వరరావు పదవీకాలం ముగిసి నాలుగు నెలల గడుస్తున్నా నేటికీ మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గానికి మోక్షం లభించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్ విధానం లేదు. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ మార్కెట్లకు రిజర్వేషన్ విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అంతకుముందు పాలకవర్గం పదవీకాలం ఐదు సంవత్సరాలు ఉండగా కేసీఆర్ ప్రభుత్వం ఒక ఏడాదికి మాత్రమే కుదించింది. ఇందులో భాగంగా మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీని బీసీ సామాజిక వర్గానికి రిజర్వు చేశారు. మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు మండలాలు ఉన్నాయి. మొట్టమొదటగా మధిర మండలానికి చెందిన చిత్తారు నాగేశ్వరరావుకి చైర్మన్ పదవి దక్కింది. ఆయన పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా ఆరు నెలల పాటు రెండుసార్లు పొడిగించారు. ఈ రెండు సార్లు పదవీకాలం కూడా ముగిసింది. మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పడిన తర్వాత బోనకల్ మండలానికి చైర్మన్ పదవి దక్కలేదు. మధిర, ఎర్రుపాలెం మండలాలకు గతంలోనూ ప్రస్తుతం చైర్మన్ పదవులు దక్కాయి. కానీ ఈసారి బోనకల్ మండలానికి చైర్మన్ పదవి ఇవ్వాలని జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగా బోనకల్ మండలానికి టిఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా రెండుసార్లు కొనసాగిన ముష్టికుంట గ్రామానికి చెందిన బంధం శ్రీనివాసరావుకి ఇవ్వాలని జెడ్పీ చైర్మన్ ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇందుకు అనుగుణంగానే బంధం శ్రీనివాసరావు తన ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగించాడు. ప్రధానంగా మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు ప్రధాన అనుచరుడుగా ఉంటున్న బంధం శ్రీనివాసరావుకి చైర్మన్ పదవి దక్కినట్లు రేపో మాపో ప్రకటిస్తారని జోరుగా ప్రచారం కూడా సాగింది. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్ 17న 'నవ తెలంగాణ' దినపత్రికలో మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బంధం శ్రీనివాసరావు ఖరారు అనే శీర్షికతో కథనం వచ్చింది. దీంతో బోనకల్లు మండలంలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు తుఫాను వచ్చినట్లుగా ఉలిక్కిపడ్డారు. ఈ కథనంతో బోనకల్ మండలంలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులలో కదలిక ప్రారంభమైంది. దీంతో బోనకల్, గోవిందాపురం ఎల్, చొప్పకట్లపాలెం, కలకోట తదితర గ్రామాలలో గల బీసీ నాయకులు చైర్మన్ పదవి కోసం పావులు కదపటం ప్రారంభించారు. ఈ కథనంతో బోనకల్ మండలానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మధిర, జిల్లా నాయకత్వం వద్దకు క్యూ కట్టారు. ఈ సమయంలో బోనకల్లు మండలానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారితోపాటు బంధం శ్రీనివాసరావు సామాజిక వర్గానికి చెందిన అన్ని గ్రామాలలోనే ఆ పార్టీ నాయకులు బంధం శ్రీనివాసరావుకి ఇవ్వటానికి వీలులేదని అల్టిమేట్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం సాగింది. మండలంలో ఎవరికిచ్చినా పూర్తిగా సహకరిస్తామని ఆ పార్టీ నాయకత్వానికి ఖరాకండిగా స్పష్టం చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. దీంతో మధిర, జిల్లా నాయకత్వం బంధం శ్రీనివాసరావుని చైర్మన్ గా నియమించే విషయంలో పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. శాసనసభ ఎన్నికల సమీపి స్తున్న సమయంలో చైర్మన్ పదవి నియమించి వివాదాలు కొని తెచ్చుకునే బదులు ఎన్నికలు అయ్యేంతవరకు నియామకం ఆపితేనే మంచిదనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగింది. అయితే ప్రధానంగా చైర్మన్ గిరి కోసం బంధం శ్రీనివాసరావు కలకోట గ్రామానికి చెందిన సీనియర్ బీసీ నాయకుడు ఇటికాల శ్రీనివాసరావు హౌరా హౌరీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మండల వ్యాప్తంగా ఎక్కువ మంది ఆ పార్టీ బీసీ నాయకులతో పాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులు కూడా ఇటికాల శ్రీనివాసరావుకు మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిసింది. బంధం శ్రీనివాసరావు మాత్రం కొండబాల కోటేశ్వరరావు ద్వారా అలుపెరగని ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. తెలుగుదేశం బంధం కొండబాల కోటేశ్వరరావుని, బంధం శ్రీనివాసరావుని విడదీయకుండా ఉందని అందులో భాగంగానే కొండబాల కోటేశ్వరరావు, బంధం శ్రీనివాసరావు వైపు మొగ్గు చూపుతున్నట్లు ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బంధం శ్రీనివాసరావుపై పెద్ద ఎత్తున ఆ పార్టీ నాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో లింగాల కమల్ రాజుకు చైర్మన్ పదవి నియామకం తలనొప్పిగా మారిందని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాన్ని నియమిస్తూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం కేంద్రంగా ఉన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని కూడా ఇటీవల నియమించగా ప్రమాణస్వీకారం కూడా జరిగింది. కానీ మధిర వ్యవసాయం మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని మాత్రం నేటికీ ప్రకటించలేదు. దీంతో ఆ పార్టీ నాయకులలో అయోమయంతోపాటు ఆందోళన నెలకొని ఉంది. మండలంలో ఆ పార్టీ మెజార్టీ అభిప్రాయ ప్రకారం చైర్మన్ పదవిని ఎంపిక చేస్తారో లేక ఏకపక్షంగా ఎంపిక చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి మండలంలో నెలకొని ఉందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. మెజార్టీ అభిప్రాయ ప్రకారం చైర్మన్ని నియమించకుండా ఏకపక్షంగా ఎంపిక చేస్తే తమ పార్టీలో ముసలం తప్పకుండా పుడుతుందని ఆ పార్టీ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొత్త చైర్మన్ ను నియమిస్తారా లేక ఎన్నికల దాకా పాలకవర్గం లేకుండా కాలం వెళ్లదీస్తారా వేచి చూద్దాం మరి.