Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై ఆగ్రహం
- గృహ వినియోగ సిలిండర్‌పై రూ.50 పెంపు
- కమర్షియల్ గ్యాస్‌పై రూ.150 వాయింపు
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7.5 లక్షల గ్యాస్ కనెక్షన్లు
- సుమారు రూ.3 కోట్ల అదనపు భారం
- నిన్న సీపీఐ(ఎం) నిరసన...నేడు బీఆర్ఎస్ ధర్నా
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సామాన్యులపై మరోమారు గ్యాస్ భారం పడింది. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ 14.2 కేజీల సిలిండర్ ధరను రూ.50మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు బుధవారం ప్రకటించాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్‌పై రూ.150 పెంచాయి. ఆ వెంటనే పెంచిన ధరలను అమల్లోకి తెచ్చాయి. మరో మారు గ్యాస్ ధర రూ.50 పెరగడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7.5 లక్షల మంది గృహ వినియోగదారులపై రూ.3 కోట్లకు పైగా భారం పడింది. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని, సామాన్యులపై బండ భారం దించాలని విపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా గురువారం ఖమ్మంలోని సరిత క్లీనిక్ సెంటర్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని మోడీ దిష్టిబమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించనున్నారు. దీనిలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
- 20 నెలల్లో రూ.300 పెంపు...
2021 జూన్ నుంచి గ్యాస్ ధరలు క్రమంతప్పకుండా పెరుగుతున్నాయి. 20 నెలల్లో రూ.300కి పైగా వంట గ్యాస్‌బండ ధరలు పెరిగాయి. 2021 జూన్‌లో రూ.840 ఉన్న సిలిండర్ జూలైలో రూ.865.50కి చేరింది. ఆగష్టులో రూ.890.50, సెప్టెంబర్‌లో రూ.915.50, 2022 ఫిబ్రవరిలో రూ.939, ఏప్రిల్ నాటికి రూ.989, మే, జూన్‌లో రూ.1037 ఉండగా పన్నులు, డెలివరీతో కలిపి జూలై 6వ తేదీ నాటికి రూ.1110కి సిలిండర్ ధర చేరింది. 2023 మార్చి1న మరో 50 పెంచడంతో రూ.1,160కి గ్యాస్ ధరలు చేరాయి. ఇలా క్రమం తప్పకుండా గ్యాస్ ధరలు పెరుగుతుండటంపై వినియోగదారులు మండిపడుతున్నారు. చమురు సంస్థలపై నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- నెలకు ఉమ్మడి జిల్లాపై రూ.3 కోట్ల భారం...
గ్యాస్ ధరల పెంపుతో ఉమ్మడి జిల్లా ప్రజలపై నెలకు రూ.3 కోట్ల భారం పడుతుంది. ఖమ్మం జిల్లాలో వంట గ్యాస్ ఏజెన్సీలు 34 ఉండగా దీనిలో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 2,01,640, డబుల్ సిలిండర్లు 78,023, దీపం కనెక్షన్లు 59,742, ఉజ్వల 47,311, సీఎస్సార్ కనెక్షన్లు 23,688, మొత్తం 4,10,404 కనెక్షన్లున్నాయి. భద్రాద్రి జిల్లాలో 25 ఏజెన్సీల పరిధిలో 3,39,825 కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం 7.5 లక్షల గ్యాస్ వినియోగదారులపై నెలకు రూ.3 కోట్ల భారం పడుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 59 ఏజెన్సీలు ఉండగా రోజుకు కనీసం 18వేల సిలిండర్లు వినియోగిస్తుండగా నెలకు 5 లక్షలకు పైగా వాడుతున్నారు. గృహ వినియోగ సిలిండర్‌పై రాయితీ రూ.18 నామమాత్రంగా ఇస్తున్నారు. ఇదిచాలదన్నట్లు డోర్ డెలివరీ పేరుతో ఏజెన్సీలు రూ.30 నుంచి రూ.50 వరకు వాయిస్తున్నాయి.
మోడీ హయంలో మూడు రెట్లు పెంపు
తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ,
బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు
మోడీ ప్రభుత్వం రాకముందు రూ.400 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధర ఎనిమిదేళ్లలో మూడు రెట్లు పెరిగింది. ఇప్పుడు సుమారు రూ.1200కు చేరింది. ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు, మరో వైపు గ్యాస్, పెట్రోల్ రేట్లు క్రమతప్పకుండా పెంచుతుండటంతో ప్రజలపై మోయలేని భారం పడుతుంది. దీన్ని నిరసిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాం. ఖమ్మం ధర్నాచౌక్‌లో నిర్వహించే ఆందోళనకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజరుకుమార్ హాజరవుతున్నారు.
- 8 ఏళ్లలో 13 సార్లు గ్యాస్ ధరల పెంపు
నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి
ప్రధాని నరేంద్రమోడీ బాధ్యతలు స్వీకరించిన 8 ఏళ్లలో 13 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. 2014లో రూ.414 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధర 2015లో రూ.606, 2016లో రూ. 747, 2021లో రూ.819, 2022లో రూ.1130, ఇప్పుడు రూ.1,170 దాటి కొన్ని నగరాల్లో రూ.1,200కు చేరువైంది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు గ్యాస్ సబ్సిడీ దేశవ్యాప్తంగా రూ.34వేల కోట్లు ఉండగా దానిని క్రమేణా తగ్గిస్తున్నారు. ప్రస్తుతం రూ.5వేల కోట్లకు కుదించడంతో ఇక గ్యాస్ సబ్సిడీ ఎత్తివేసినట్టేనని రుజువు అవుతోంది.