Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీడబ్ల్యూఓకి దీక్ష శిబిరంలో సమస్యలను విన్నవించిన సీఐటీయూ
- ప్రభుత్వం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ
- రెండో రోజు కొనసాగిన ధర్నా
- భారీగా హాజరైన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు
నవతెలంగాణ-పాల్వంచ
అంగనవాడీ కేంద్రాలకు మే నెల మొత్తం పూర్తిస్థాయి వేసవి సెలవులను ఏకకాలంలో టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్లకు అమలు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ డిమాండ్ చేసింది. 36 గంటల ధర్నాలో భాగంగా రెండవ రోజు కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్‌లో వందలాది మంది అంగన్వాడీ టీచర్లు బయటాయించి ధర్నాని కొనసాగించారు. మొదటి రోజు మార్చి రెండవ తేదీన ధర్నా చౌక్‌లోని నిద్రించిన అంగనవాడి టీచర్లు, హెల్పర్లు రెండో రోజు తమ ధర్నాను కొనసాగించారు. ఈ సందర్భంగా ధర్నా వద్దకు జిల్లా జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ అధికారి లెనినా చేరుకొని వినతి పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకత్వం డీడబ్ల్యుఓకు విన్నవించారు. మే నెల మొత్తం వేసవి సెలవులు ఇచ్చే విధంగా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాల నుంచి పిల్లలు తల్లులకు అందించే పోషకారాన్ని మే నెలలో టీహెచ్ఆర్ టేక్ హౌమ్ రేషన్ పేరుతో అమలు చేయాలని, ఆ విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా డీడబ్ల్యుఓ లేఖ రాయాలని కోరారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రాజెక్టు మీటింగులు జరిగే కేంద్రాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీలు భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ విడుదల చేయాలని వినతి పత్రం ద్వారా డీడబ్ల్యుఓని సీఐటీయూ కోరింది. అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్రం నుంచి రావాల్సిన 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏ టీఏలను, ఇంటి అద్దెలను, ఇన్చార్జి సెంటర్ అలవెన్స్‌లను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు ఆదివారం సెలవు దినాల్లో అలాగే సెంటర్ సమయం దాటిన తర్వాత కేంద్రాలకు స్టాకు సరఫరా చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన కోడిగుడ్లు, కందిపప్పు తదితర సరుకులు సప్లై చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి కేంద్రాలకు ప్రభుత్వమే గ్యాస్ ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్ ధరల వల్ల అంగన్వాడి కేంద్రాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని ఈ ఆర్థిక భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పిఆర్సి మూడు నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. సమస్యలపై స్పందించిన జిల్లా డీడబ్ల్యుఓ ప్రాజెక్టు కేంద్రాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని, జిల్లాలోని అందరు సీడీపీఓలకు లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారు. వేసవి సెలవులు మే నెల మొత్తం అమలు చేయాలని డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వేతనాల పెంపుదల గ్రాట్యూటి సిటీ చట్టం అమలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తానని డీడబ్ల్యుఓ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే.బ్రహ్మచారి, ఏజే.రమేష్, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈసం వెంకటమ్మ, జి.పద్మ, సీఐటీయూ జిల్లా ఆఫీస్ బ్యానర్లు గద్దల శ్రీను, పిట్టల అర్జున్, కే.సత్య, డి.వీరన్న, నాయకులు ఎస్ఏ.నబి, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు వెంకటరమణ, విజయశీల, కృష్ణవేణి, రాధా, సూరమ్మ, మరియా, రాధా, అనసూయ, హేమలత తదితరులు పాల్గొన్నారు.