Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జే.రమేష్
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
- ముగిసిన 36 గంటల అంగన్వాడీల దీక్ష
నవతెలంగాణ-పాల్వంచ
కళ్ళుండి చూడలేని, చెవులు ఉండి వినలేని గుడ్డి, చెవిటి ప్రభుత్వమా ఒక్కసారి అంగనవాడీ రాష్ట్రవ్యాప్త ఈ పోరాటాన్ని ఇకనైనా చూసి సీఎం కేసీఆర్ కళ్ళు తెరవాలని అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ డిమాండ్ చేశారు. అంగన్వాడీల ముగింపుకు ముందు ధర్నా చౌక్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదురుగా వేలాదిమంది ధర్నా నిర్వహించారు. ముగింపు సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి అధ్యక్షతన జరిగిన సభలో ఏజె రమేష్ పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీలు 70 వేల మంది ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారని, చాలీచాలని వేతనంతో వారి జీవితాన్ని గడుపుతున్నారని, ఒక్కొక్కరు 25 సంవత్సరాల నుండి పనిచేస్తున్న అంగన్వాడి టీచర్లు కూడా ఇందులో ఉన్నారని, వారికి ఎలాంటి రిటైర్మెంట్ సౌకర్యం గాని గ్రాడ్యుటిగాని ఇవ్వకుండా ఎట్టి చాకిరి చేయించుకుంటూ వారి పట్ల నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఎవరిస్తుందని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపుల్లో ఐసీడీఎస్‌కు నిధులు తగ్గిస్తూ ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నంలో భాగమే ఈ రకంగా ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నా యన్నారు. దానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నదని దానికి ఈ పోరాటమే ప్రత్యక్ష సాక్ష్యామని ఆయన తెలిపారు. ఈ పోరాటం ప్రజా పోరాటంగా మారకముందే ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ అంగన్వాడీ యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మ అధ్యక్షురాలు వెంకటమ్మ, జిల్లా నాయకులు గద్దల శ్రీను, పిట్టల అర్జున్, డి.వీరన్న, కే.సత్య, దొడ్డ రవికుమార్, భూక్య రమేష్, కాంతారావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.