Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచుతూ పేదలపై భారం మోపుతున్న కేంద్రం
- విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-మణుగూరు
వచ్చే ఎన్నికలలో బీజేపీ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ పార్టీ కార్యాలయం నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంటర్ వరకు పార్టీ ప్రజా ప్రతినిధులు, మహిళలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ... కంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని, గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో సామాన్యులపై భారం మోపుతున్నదని ఆయన అన్నారు.
పొయ్యి వెలిగించి ధర్నా : మెచ్చా
అశ్వారావుపేట : గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ మండల కమిటీ ఆద్వర్యంలో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మూడు రోడ్ల కూడలిలో ఖాలీ సిలిండర్లతో పొయ్యి వెలిగించి బియ్యం ఉడికించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామమూర్తి, జడ్పీటీసీ వరలక్ష్మి, సర్పంచ్లు సాధు జ్యోత్స్నా భాయి, నారం రాధ, బీఆర్ఎస్ మండల అద్యక్ష కార్యదర్శులు బండి పుల్లారావు, వెంకన్న బాబు, నాయకులు రాజమోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కట్టెల పొయ్యి పెట్టి వంట వార్పు నిర్వహించిన ఎమ్మెల్యే
ఇల్లందు : అడ్డు అదుపు లేకుండా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ పేదలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వంపై ఇల్లెందు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు హౌరెత్తాయి. మహిళలతో కలిసి, వినూత్న రీతిలో గ్యాస్ సిలిండర్ పక్కకు పెట్టి కట్టెల పొయ్యి మీద వంట వార్పు నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరి సింగ్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, జిల్లా రైతు బంధు సభ్యులు మాధవరావు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ 3 మున్సిపల్ ఫ్లోర్ కొక్కు నాగేశ్వరావు పాల్గొన్నారు.